కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పూర్తి బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉంది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ విషయంలో మనం ప్రారంభం నుంచే సీబీఐ విచారణకు డిమాండ్ చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌ను కాపాడేందుకు ప్రయత్నించి, చర్యను కావాలనే ఆలస్యం చేసింది.
ఇప్పుడు ప్రభుత్వం నిజాన్ని అంగీకరించి కేసును సీబీఐకి అప్పగించేందుకు ఒప్పుకుంది. దీన్ని అమలు చేయడంలో కూడా ఆలస్యం చేయకుండా, సీబీఐకి అంగీకార పత్రాన్ని వెంటనే పంపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. గతంలో కూడా కాంగ్రెస్ అసెంబ్లీలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై ఎస్‌ఐటి వేసినట్టు ప్రకటించినా, చివరకు ఎస్‌ఐటి ఏర్పాటు చేయకుండా మాట తప్పింది. ఇదీ అలాంటి మరో మోసం కావద్దు. ఇక మొబైల్ ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక కొత్త మలుపుతో సాగుతున్న సీరియల్‌లా మారిపోయింది. రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది...అని బండి సంజయ్ రాసుకొచ్చారు.