సీఎం స్థానంలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు..రేవంత్‌పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik
సీఎం స్థానంలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు..రేవంత్‌పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని, అణా పైసా ఎవరూ ఇవ్వడం లేదని, బ్యాంకులకు వెళితే తమను దొంగల్లాగా చూస్తున్నారని సీఎం చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి వెళితే.. ప్రధాన మంత్రి తో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదని ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని అన్నారు. అదే విధంగా అప్పు కోసం వెళితే తనను చెప్పులు ఎత్తుకెళ్లేవాడిలా చూస్తున్నారని అన్న సీఎం వ్యాఖ్యలపై.. బండి సంజయ్ అది కాంగ్రెస్ కల్చర్ కావొచ్చేమోనని సెటైర్లు వేశారు.
ప్రజలకు, ఉద్యోగులకు ధైర్యం చెప్పాల్సింది పోయి రాష్ట్రం దివాళా తీసిందంటూ వారిలో అధైర్యం నింపుతారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందని కామెంట్ చేశారు. ఇలా కుటుంబ పెద్దే చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటని అన్నారు. ప్రభుత్వం నడపలేమనే స్థితిలో ఉన్నామంటూ కాంగ్రెస్ చేతులెత్తేసిందని పేర్కొన్నారు. ప్రజలు తమను ఓట్లు వేసి గెలిపించారని.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ గాలికి వదిలిసినట్లుగా పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంపై రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయం ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌కు తెలుసని.. అప్పుల గురించి తెలిసే హమీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్‌గా చెప్పేశారని.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెలేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ అన్నారు.
Live from Rajanna Sircilla District https://t.co/JiOFlU9gq1
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 6, 2025