ఎందుకీ హై‘డ్రామా’లు.?.. అక్రమమని తెలిసి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు.?

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు

By Medi Samrat  Published on  9 Sep 2024 9:46 AM GMT
ఎందుకీ హై‘డ్రామా’లు.?.. అక్రమమని తెలిసి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు.?

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను మొదట హైడ్రాకు సపోర్ట్ చేసిన. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించిన.. కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకీ హైడ్రామాలు? అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.’’అని ప్ర‌శ్నించారు.

బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి పాల్గొన్నారు.

దేశం, సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. 18 కోట్ల సభ్యత్వ నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఈసారి మరో 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలని హైకమాండ్ నిర్ణయించిందని తెలిపారు.

తెలంగాణలో 77 లక్షల మంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారని.. వాళ్లందరినీ బీజేపీ సభ్యలుగా చేర్చాలిన అవసరం ఉందన్నారు. అదే విధంగా సభ్యత్వ నమోదులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అగ్రభాగాన ఉండాలన్నారు. అది జరగాలంటే ప్రతి పోలింగ్ బూత్ లోనూ అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేయాలని.. అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసిన పోలింగ్ బూత్ కమిటీలను సన్మానిస్తామ‌ని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే.. అత్యధికంగా బీజేపీ సభ్యులుగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశం. పార్టీ కోసం పని చేసే వారికే టికెట్లు ఇస్తాం. ఈ విషయంలో నా దగ్గర పైరవీలు నడవవు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు? ఎవరు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు నివేదికలొస్తున్నాయన్నారు.

బీఆర్ఎస్‌ అవుట్ డేటెడ్ పార్టీ.. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదు. బిడ్డ జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నాడు. చేతనైతే వరదలవల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ యాగాలు చేయాలన్నారు. రాష్ట్రమంతా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంటే కేసీఆర్ కనీసం ఎందుకు స్పందించడం లేదు? ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎంతో మాట్లాడారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద బాధితులను పరామర్శించలేదు? కనీసం ఎందుకు స్పందించడం లేదు? అందుకే ప్రజలంతా ఆయనకు ‘ నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి మొదలైందన్నారు. అతి తక్కువ కాలంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఇగ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. హైడ్రా పేరుతో డైవర్ట్ చేస్తూ హైడ్రామాలాడుతోందని విమ‌ర్శించారు. హైడ్రాతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు.. హైడ్రా పై విశ్వాసం పోతుందన్నారు. నేను మొదట హైడ్రా కి సపోర్ట్ చేశాను. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించినం.. కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో సమాధానం చెప్పాలని ప్ర‌శ్నించారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్నారు.

Next Story