ఆలోపు నిరూపిస్తే కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తా : బండి సంజయ్ సవాల్
రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 27 April 2024 6:50 AM GMTరుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరు పార్టీల నేతలు డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగుల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు బండి సవాల్ విసిరారు. ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నరు. నేను మీకు సవాల్ చేస్తున్నా.. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే నేను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటా.. అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమేనన్నారు. నిరూపించకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొలిటికల్ డ్రామాలాడుతున్నరు.. ఒకాయన పంద్రాగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని అంటుంటే.. ఇంకోకాయన సాధ్యం కాదు.. రాజీనామా చేస్తానని మీడియాలో బ్రేకింగుల కోసం ఇద్దరూ కలిసి డ్రామాలాడుతూ 6 గ్యారంటీలపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నరు. వాళ్లిద్దరికీ నేను సవాల్ విసురుతున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నరు. మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మోసం చేశారు. ఇప్పుడేమో 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలాడుతున్నరు. మీరు మహిళలకు తులం బంగారం, స్కూటీతోపాటు నెలనెలా రూ.2500 బ్యాంకులో జమ చేసినట్లు, ఆసరా పెన్షన్లను రూ. 4వేలు ఇస్తున్నట్లు.. ఇల్లులేనోళ్లకు జాగా, రూ.5 లక్షలిస్తున్నట్లు.. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇచ్చినట్లు చెబుతున్నారు. రుజువు చేస్తే నేను పోటీ నుండి తప్పుకునేందుకు నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే 17 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులంతా పోటీ నుండి తప్పుకుంటారా?.. ఈ సవాల్ కు స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని అడిగారు.
అభ్యర్థుల ఉప సంహరణకు ఎల్లుండి చివరి తేదీ.. ఆలోపు నిరూపిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటా.. ఎన్నికల్లోపు నిరూపించినా సరే.. నేనే స్వయంగా కాంగ్రెస్ అభ్యర్ది తరపున ప్రచారం చేస్తా... దమ్ముంటే నా సవాల్ కు స్పందించాలి... మీకు నిజంగా బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా మేనిఫెస్టో పవిత్రమైనదైతే.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే నా సవాల్ ను స్వీకరించాలి. ప్రజల ముందు ఆధారాలతోసహా నిరూపించాలి. డేట్, టైం, వేదిక మీరే డిసైడ్ చేయండి. అమర వీరుల స్థూపం వద్దకైనా వస్తా.. సర్దార్ పటేల్ విగ్రహం వద్దకైనా.. భాగ్యనగర్ అమ్మవారి ఆలయం వద్దకైనా సరే.. క్కడికైనా వచ్చేందుకు నేను సిద్దం అని సవాల్ విసిరారు.