వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం: మోదీ

By సుభాష్  Published on  13 Dec 2019 11:17 AM GMT
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం: మోదీ

దేశ ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సోయం బాపురావు, అర్వింద్‌, బండి సంజయ్‌ తదితరులు మోదీని కలిశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పని చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. తెలంగాణలో పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు బీజేపీ ఎంపీలతో మోదీ మాట్లాడారు. కాగా, ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ ప్రసాదాన్ని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ప్రధాని మోదీకి ఇచ్చారు.

అలాగే, కేంద్రం నుంచి పెండింగ్‌ నిధులపై కూడా తెలంగాణ ఎంపీలు ప్రధానితో మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అందరు కష్టపడి పని చేయాలని, వచ్చే ఎన్నికల్లో పాలన పగ్గాలు బీజేపీయేనని ఆశాభావం వ్యక్తం చేశారు. దిశ ఘటన నేపథ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ప్రజల స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పౌరసత్వ సవరణ బిల్లుకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వలేదని ఎంపీ బండి సంజయ్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. టీఆర్‌ఎస్‌ వాళ్లు అలాగే ఉంటారు అంటూ వ్యాఖ్యనించారు. తెలంగాణలో అందరిని కలుపుకొని వెళ్లాలని మోదీ ఎంపీలకు సూచించారు.

Next Story