ఎండ్‌నౌ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్లాకు ప్రతిష్టాత్మక పురస్కారం

By అంజి  Published on  3 Dec 2019 11:25 AM GMT
ఎండ్‌నౌ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్లాకు ప్రతిష్టాత్మక పురస్కారం

డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించే భారతదేశపు మొట్టమొదటి లాభాపేక్షలేని సంస్థ అయిన ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ రాచమల్లాకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. న్యూఢిల్లీకి చెందిన రెక్స్ కాన్‌క్లేవ్ సంస్థ ప్రతిష్టాత్మక 'కర్మవీర్‌చక్ర' అవార్డుతో పాటు.. 'రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్‌'ను అనిల్‌ రాచమల్లాకు ప్రదానం చేశారు. అవార్డు కింద బంగారు పతకాన్ని అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుండి ఈ అవార్డు పొందిన ఏకైక వ్యక్తి అనిల్‌ రాచమల్లా.

సిటిజెన్ సోషల్ యాక్షన్ అనే అంశంలో ఆదర్శనీయ సేవలు అందించే వ్యక్తులకు అందించే జాతీయ స్థాయి పురస్కారం కర్మవీర్ చక్ర అవార్డు. ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవో (ఐకాంగో) చేత స్థాపించబడిన రెక్స్ కాన్‌క్లేవ్ సంస్థ ఈ అవార్డులు అందిస్తోంది. భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్‌ ఏపీజె అబ్దుల్‌ కలామ్‌కు 2011లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేసింది రెక్స్‌ కాన్‌క్లేవ్‌ సంస్థ. ఈ అవార్డు పొందిన వాళ్లను నోబెల్ గ్రహీతలుగా అభివర్ణిస్తారు.

ఎండ్ నౌ ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు :

అనిల్ రాచమల్లా డిజిటల్ సేఫ్టీపై, అడ్వకేసీపై చేసిన వినూత్న కృషికి ఈ అవార్డును అందుకున్నారు. మహిళలు, పిల్లలు మరియు కౌమారదశలో ఉన్న యువతీ యువకుల బాధ్యతను గుర్తుచేయడం, వాళ్లలో ఆరోగ్యకరమైన ఆన్‌లైన్ బిహేవియర్‌ను పెంపొందించడానికి, తద్వారా వాళ్లలో చైతన్యం నింపడానికి ఎండ్‌నౌ ఫౌండేషన్‌ కృషిచేస్తోంది. ఇంటర్నెట్‌ ఎథిక్స్‌, డిజిటల్‌ వెల్‌నెస్‌ పెంపొందించడం కోసం అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఎండ్‌నౌ ఫౌండేషన్‌.

ఇప్పటివరకు ఎండ్‌నౌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 350కి పైగా చర్చలు (గ్రూప్‌ డిస్కషన్స్‌), 29కి పైగా వర్క్‌షాప్‌లు మరియు 11 ఎగ్జిబిట్‌లను నిర్వహించడం జరిగింది. గోప్యత మరియు సామాజిక ఇంజనీరింగ్ నేరాలపై 8 కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు ఎండ్‌నౌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అనిల్‌ రాచమల్లా.

ఎండ్ నౌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన కార్యక్రమాలు :

1.సైబర్ సురక్ష - "డిజిటల్ సేఫ్టీ అడ్వకేట్స్ ద్వారా అవగాహన"

2.సైబర్ గురు - "ఎఫ్ఎమ్ ఛానల్ ద్వారా అవగాహన" - రేడియో సిటీ 91.1

3.సైబర్ రక్షక్ - "విద్యార్థి రాయబారుల ద్వారా అవగాహన"

4.డిజిటల్ శ్రేయస్సు మండలి - " కార్పొరేట్ మరియు విద్యా సంస్థల ద్వారా అవగాహన"

డిజిటల్‌ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రధాన లక్ష్యం:

ఎండ్ నౌ ఫౌండేషన్ కొన్నేళ్లుగా తెలంగాణ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్, ఐటి మంత్రిత్వ శాఖ, సాక్షర భారత్, డీఎస్‌సీఐ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణతో కలిసి పనిచేస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు, సైబర్ న్యాయవాదులు మరియు సైకియాట్రిస్టులతో కలిసి యువతలో, మహిళలో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపడుతోంది. సైబర్ భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై ఉచితంగా అవగాహన కల్పిస్తోంది. ఆన్‌లైన్ పర్యవేక్షణ, సామర్థ్యాలను నియంత్రించడానికి టీనేజ్ / యువతకు సరైన మార్గనిర్దేశం చేస్తోంది.

Next Story