ఏడాది చివరకు హైదరాబాద్ లో 85వేల ఇళ్లు రెఢీ చేయనున్న సర్కార్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Aug 2020 5:39 AM GMTహైదరాబాద్ మహానగరంలోని నిరుపేదలు.. పేదలకు సొంతింటి కలను తీర్చేందుకు వీలుగా.. కేసీఆర్ సర్కారు డబుల్ బెడ్రూం ఇళ్ల వరాన్ని ఇవ్వటం తెలిసిందే. మహానగరంలోని 24 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి నాలుగువేల చొప్పున సుమారు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం సాగుతోంది. ఇందులో 85 వేల ఇళ్లను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి.. పంపిణీ చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది.
ఎప్పుడో ప్రారంభమైన డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యవహారం.. సాగుతూనే ఉంది కానీ పూర్తి కానీ పరిస్థితి. తాజాగా ప్రభుత్వం ఈ పనుల్ని పూర్తి చేసేందుకు పరుగులు పెట్టిస్తోంది. ఈ లక్ష ఇళ్లలో దాదాపు 85వేల ఇళ్లను గ్రేటర్ హైదరాబాద్ పరిధి (జీహెచ్ఎంసీ) పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ఎందుకిలా? ఎందుకింత హడావుడి? గతంలో ఎప్పుడూ లేని రీతిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పూర్తిపై ప్రభుత్వం ఎందుకింత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.
దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణంలో సింహభాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వాటిని ఏడాది చివరకు పూర్తి చేయటమే కాదు.. వెనువెంటనే లబ్థిదారులకు అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది మార్చిలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు కాస్త ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
ఒకేసారి 85వేల ఇళ్లను పేదలకు ఇప్పించటం ద్వారా.. వారందరి మనసుల్ని దోచేయాలన్న యోచనలో సర్కారు ఉందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. గ్రేటర్ ఎన్నికల్లో అధికారపార్టీకి తిరుగు ఉండదన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల పుణ్యమా అని.. పనుల్ని పరుగులు పెట్టిస్తున్న వైనం కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టుల కంటే కూడా అత్యధిక ప్రాధాన్యత హైదరాబాద్ సిటీలోని డబుల్ బెడ్రూం ఇళ్లకు ఇవ్వాలని చెప్పటం చూస్తే.. విషయం ఇట్టే అర్థం కాక మానదు.