రెండింటికి చెడ్డ రేవడిగా తెలంగాణ కాంగ్రెస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jun 2020 5:27 AM GMT
రెండింటికి చెడ్డ రేవడిగా తెలంగాణ కాంగ్రెస్

పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. కొన్ని రంగాలు పని చేస్తూనే ఉండాలి. ఆ కోవలోకే వస్తుంది రాజకీయ రంగం. అన్ని బాగున్న రోజున నేతల అవసరం ఎవరికి ఉండదు. ఎప్పుడైతే సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారో.. అప్పుడే వారు ఎంట్రీ ఇస్తే ప్రయోజనం. ఈ చిన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్లు కనిపించట్లేదు. మాయదారి రోగంతో పరిస్థితులు దారుణంగా తయారైన వేళ.. వివిధ వర్గాల ప్రజలు కోరుకుంటున్నసాయం అంతా ఇంతా కాదు.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. నిర్దారణ పరీక్షలు.. అనుమానితులకు ధైర్యం కలిగించే చర్యలు తీసుకోవటం లాంటి వాటికి సంబంధించి ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేతలకు మధ్య అంతరం మామూలే. ఇలాంటి వేళలో.. అలాంటి విషయాన్ని ప్రస్తావించి.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయాల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు మర్చిపోయినట్లు కనిపిస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అధికారంలో ఉండి కూడా అలుపెరగని రీతిలో ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ.. విపక్షాలు మరింత నీరసించేలా చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. తాజాగా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. మొన్నటివరకూ చప్పుడు చేయని గులాబీ పార్టీ.. మొన్న ముఖ్యమంత్రి నోటి నుంచి పీవీ శతజయంతి ఉత్సావాల్ని ఎలా నిర్వహించాలన్న దానిపై సమీక్ష జరపటం.. నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. నిజానికి పీవీ శతజయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలన్నదే ఆలోచన అయితే.. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు చాలావరకు మొదలు పెట్టాల్సి ఉంది.

అందుకు భిన్నంగా.. సరిగ్గా నాలుగైదు రోజుల ముందు నుంచి చేస్తున్న హడావుడి చూస్తే.. విపక్ష కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే చెక్ చెప్పటానికి.. పీవీ లాంటి నేతను అన్యాయంగా అవమానించిన పార్టీగా కాంగ్రెస్ ను బోనులో నెట్టేందుకు సీఎం కేసీఆర్ వేసిన ఎత్తుగా పలువురు అభివర్ణిస్తున్నారు. పీవీని భుజాన ఎత్తుకుంటూ కేసీఆర్ నిర్ణయాలపై కాంగ్రెస్ లోలోన రగిలిపోవటం మినహా ఏమీ చేయలేదని పరిస్థితి. పీవీని పొగిడి.. ఏదైనా భారీ కార్యక్రమం చేపడితే.. అధినేత్రి సోనియాకు కోపం రావొచ్చు. అలా అని వదిలేస్తే.. పీవీలాంటి మహానేతను పట్టించుకోని పార్టీగా తెలంగాణ కాంగ్రెస్ విమర్శల పాలు కావటం ఖాయం. ఇలా ఇరుకున పడేసేందుకు వీలుగా కేసీఆర్ పావులు కదిపారన్న వాదన వినిపిస్తోంది.

మరోవైపు.. బీజేపీ విషయానికి వస్తే.. ఏదో ఒక అంశాన్ని భుజాన వేసుకొని.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించటం.. వారు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. కంట్లోనలుకలా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమదైన వ్యూహాలతో దూసుకెళుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్ మాత్రం పెద్ద చప్పుడు చేయకుండా ఉండిపోవటం గమనార్హం. మరీ.. నిశ్శబ్దం వెనుకున్న లక్ష్యం ఏమైనా కానీ.. రాజకీయ ఆటలో లేనట్లుగా ఉండటం ఆ పార్టీకి.. పార్టీ నేతలకు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని వారెప్పటికి గుర్తిస్తారో?

Next Story