తెలంగాణలో ప్రైవేటు ల్యాబుల్లో తప్పులు చేస్తున్నారా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jun 2020 4:53 AM GMT
తెలంగాణలో ప్రైవేటు ల్యాబుల్లో తప్పులు చేస్తున్నారా?

మిగిలిన రాష్ట్రాల్ని పక్కన పెట్టేస్తే.. మాయదారి రోగానికి సంబంధించిన నిర్దారణ పరీక్ష కావొచ్చు.. చికిత్స కావొచ్చు.. ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? పరిస్థితులు చేజారే పరిస్థితి వస్తే కింకర్తవ్యం ఏమిటి? అన్న దానిపై పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు పెరుగుతున్న కేసుల సంఖ్యను అంచనా వేసిందేనని చెబుతున్నారు. మహమ్మారి నిర్దారణకు పరీక్షలు కానీ.. వైద్యం కానీ ప్రైవేటుకు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్నించి ససేమిరా అనేవారు.

మొత్తానికి ఏమైందో కానీ.. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యానికి ఓకే చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రోగ నిర్దారణ కోసం చేసే టెస్టులకు ఐసీఎంఆర్ కొన్ని ల్యాబులకు అనుమతులు ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రైవేటు ల్యాబుల్లో ఇచ్చిన ఫలితాల్లో తేడాలు ఉన్నాయన్న విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తాయి. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య శాంపిళ్లను సేకరించాల్సిన స్థానంలో.. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శల నేపథ్యంలో ఐసీఎంఆర్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

సదరు కమిటీ తాజాగా నివేదిక ఇచ్చింది. ఇందులో పేర్కొన్న అంశాలు కాస్తా బయటకు వచ్చాయి. పాజిటివ్ టెస్టుల సంఖ్యను మాత్రమే ఇస్తున్న ప్రైవేటు ల్యాబులు.. తాముచేసిన మొత్తం టెస్టుల సంఖ్యను చెప్పటం లేదు. దీంతో.. తక్కువ పరీక్షలకు ఎక్కువ పాజిటివ్ లు అన్నట్లుగా గణాంకాలు చెప్పేసే పరిస్థితి. ఇలా బాధ్యతారాహిత్యంతో ల్యాబులు వ్యవహరించాయన్నది ప్రధాన ఆరోపణ. ఇదే తీరులో కమిటీ గుర్తించిన లోపాల్ని చూస్తే..

  • ప్రైవేటు ల్యాబ్స్‌లో సరైన భద్రతా ఏర్పాట్లు లేవు.
  • ఇక్కడ పని చేసే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించట్లేదు. సేఫ్టీ కేబినెట్లు లేవు.
  • శాంపిళ్లు సేకరించే ల్యాబుల్లో పరిశుభ్రమైన వాతావరణ పరిస్థతులు లేవు.
  • మహమ్మారిని నిర్దారించే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడంపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదు
  • నాణ్యత నియంత్రణ.. టెస్టుల వ్యాలిడిటీ ప్రమాణాలను కొన్నిచోట్ల పాటించట్లేదు.
  • పూల్‌టెస్టింగ్‌ చేస్తున్న కొన్ని ల్యాబ్‌లు.. పరీక్షలో పాజిటివ్‌ వస్తే, ఒక్కో నమూనానూ మళ్లీ విడిగా పరీక్షించకుండా.. అన్నిటినీ పాజిటివ్‌గా చూపుతున్నాయి.
  • ఈ కారణంతో కొన్ని నెగిటివ్ కేసులు కాస్తా పాజిటివ్ కేసుల ఖాతాలో పడుతున్నాయి.
  • ల్యాబుల్లో సరైన భద్రత చర్యలు, పాటించాల్సిన ప్రొటోకాల్స్‌ పాటించటం లేదు.
  • దీని కారణంగా నమూనాలు మలినమై.. ఎక్కువ పాజిటివ్ లు వచ్చే ప్రమాదం ఉంది
  • ఐసీఎంఆర్‌, రాష్ట్ర ప్రభుత్వ డేటా పోర్టల్‌కు ప్రైవేటు ల్యాబ్ లు అప్‌లోడ్‌ చేసిన గణాంకాల్లో తేడాలుండడం ఆందోళన కలిగించే విషయం. 9577 టెస్టులు చేస్తే 2076 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాయి. అదే సమయంలో.. 6733 టెస్టులకు.. 2836 పాజిటివ్‌ వచ్చినట్టు రాష్ట్రపోర్టల్‌కు అప్‌లోడ్‌ చేశాయి. వారి రికార్డుల్లో మాత్రం 12,700 టెస్టులు చూపి, అందులో 3571 పాజిటివ్‌ ఉన్నట్లుగా రాసుకున్నారు.
  • ఒక ప్రముఖ ఆస్పత్రిలో ల్యాబ్‌లో 3940 టెస్టులు నిర్వహించారు. అప్‌లోడ్‌ మాత్రం 1568 టెస్టులు చూపారు. ఇందులో 475 పాజిటివ్‌ కేసులుగా పేర్కొన్నారు.
  • అంటే పాజిటివ్‌ రేటు 30.29 శాతం. కానీ, వాస్తవంగా చేసిన పరీక్షల ప్రకారం పాజిటివ్‌ రేటు 12.05 శాతమే. ఇది చాలా ఎక్కువ. వాస్తవంగా చేసిన పరీక్షల సంఖ్యను అప్‌లోడ్‌ చేసి ఉంటే.. పాజిటివ్‌ రేటు చాలా తక్కువగా ఉండేది.
  • కొన్ని ల్యాబ్‌లు చాలా ఇరుకు ప్రాంతంలో, అపరిశుభ్రంగా ఉన్నాయి. పరికరాల నిర్వహణ కూడా సరిగా లేదు.

Next Story