కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Sept 2020 6:50 AM ISTకేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి(65) కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈనెల 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. కరోనా సోకిందని ఈ నెల 11న స్వయంగా ట్వీట్ చేసిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు.
కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బెళగావి జిల్లాలోని కేకే కొప్పా ఆయన స్వస్థలం. సురేశ్ తల్లిదండ్రులు సోమవ్వ, చెన్నబసప్ప. సురేశ్ భార్య పేరు మంగల్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు.
ఇదిలావుంటే.. కర్ణాటకలో కరోనా బారిన పడి మరణించిన బీజేపీ రెండో ఎంపీ సురేష్ అంగడి. రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్ గస్తీ(55) ఈ నెల 17న బెంగళూరులో కన్నుమూశారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఇద్దరు నాయకులు ప్రాణాలు కోల్పోవడం బీజేపీ శ్రేణులను తీవ్ర వేదనకు గురిచేసింది.
కేంద్రమంత్రి సురేష్ అంగడి హఠాన్మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు.