అఖిల్ రీరీరీరీలాంచ్.. అతడితో.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2020 5:34 PM ISTటాలీవుడ్లో ఏ అరంగేట్ర హీరో సినిమాకూ లేనంత హంగామా కనిపించింది అఖిల్ విషయంలో. అతడి తొలి సినిమా 'అఖిల్'కు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఏకంగా 40 కోట్ల మేర బిజినెస్ జరిగిందా చిత్రానికి. హీరోగా అరంగేట్రం చేయడానికి ముందే పెద్ద ఎత్తున ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్నాడు అఖిల్.
కానీ ఏం ప్రయోజనం? వి.వి. వినాయక్ లాంటి పెద్ద దర్శకుడిని నమ్మి ఆ సినిమా చేస్తే తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్నాక నాగార్జున చాలా జాగ్రత్తగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చేయించాడు. ఆ సినిమాను అఖిల్‌కు రీలాంచ్‌గా పేర్కొన్నాడు. కానీ ఫలితం మళ్లీ అదే. మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టరే అయింది.
ఆ తర్వాత మిస్టర్ మజ్ను సంగతి తెలిసిందే. అది కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద పెద్దగా అంచనాలైతే లేవు. ఎందుకంటే భాస్కర్ ట్రాక్ రికార్డు అలాంటిది. ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ అయితే లేదు. సినిమా ఓ మోస్తరుగా ఆడితే ఆడొచ్చు కానీ.. పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకాలైతే లేవు.
ఈ నేపథ్యంలో నాగ్ అఖిల్ కోసం ఓ పెద్ద దర్శకుడిని సెట్ చేసినట్లు సమాచారం. ‘సైరా’ లాంటి భారీ చిత్రం తీసిన సురేందర్ రెడ్డి.. అఖిల్‌తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని నాగార్జునే నిర్మిస్తాడట. ఈ సమాచారం బయటికి వచ్చినప్పటి నుంచి జనాలు అఖిల్‌కిది రీరీరీరీ లాంచ్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఐతే ఎవరేమనుకున్నా సరే.. అఖిల్‌కు పెద్ద హిట్ ఇచ్చి అతణ్ని హీరోగా నిలబెట్టాలన్నది నాగార్జున లక్ష్యం.