ఆ సినిమా తనకు తెగ నచ్చేసిందని చెబుతున్న రామ్ చరణ్ తేజ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2020 8:45 AM GMT
ఆ సినిమా తనకు తెగ నచ్చేసిందని చెబుతున్న రామ్ చరణ్ తేజ్

లాక్ డౌన్ కారణంగా పలు సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విడుదలవుతూ ఉన్నాయి. ఇటీవలే సత్యదేవ్ నటించిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమా మలయాళం సినిమా 'మహేషింటే ప్రతీకారం' రీమేక్ గా తెరకెక్కింది. రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ కు ఎటువంటి అన్యాయం చేయలేదు. కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు వెంకటేష్ మహా ఈ కామెడీ డ్రామాను తెరకెక్కించాడు

ఈ సినిమా లో లీడ్ యాక్టర్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు. చిన్న పాత్రకు కూడా కథలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అరకు అందాలను అప్పు ప్రభాకర్ ఎంతో అందంగా తన కెమెరా పనితనంతో చూపించాడు. సినిమాను ఇప్పటికే ఎంతో మంది మెచ్చుకున్నారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాను మెచ్చుకున్నారు. తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో సినిమాను అద్భుతంగా రూపొందించారని చెప్పడమే కాకుండా సత్యదేవ్, నరేష్, సుహాస్, హరి చందన, రూపల నటనను మెచ్చుకున్నారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు.

వైజాగ్ లో పుట్టిన సత్యదేవ్.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ లో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్.. బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా సినిమాల ద్వారా హిట్స్ ను అందుకున్నాడు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కూడా అతడి లో ఎంత మంచి నటుడు ఉన్నాడో బయటకు తీసుకుని వచ్చింది.

అందుకే పలువురు ప్రముఖులు అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉన్నారు. కన్నడ హిట్ సినిమా అయిన 'లవ్ మాక్ టైల్' ను తెలుగులో రీమేక్ చేసే అవకాశాలు వస్తున్నాయని చెబుతూ ఉన్నారు. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా చేయనుందనే వార్తలు కూడా వచ్చాయి. సత్యదేవ్ ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు.

Next Story