సెప్టెంబరు 2 టార్గెట్.. 100 మిలియన్లు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2020 9:21 AM GMT
సెప్టెంబరు 2 టార్గెట్.. 100 మిలియన్లు.!

‘బాహుబలి’ని పక్కన పెట్టి చూస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల్లో మెజారిటీ మెగా ఫ్యామిలీ హీరోల ఖాతాలోనే ఉంటాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ నలుగురూ ఎవరికి వాళ్లు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన వాళ్లే. ఇక సోషల్ మీడియా రికార్డులన్నా కూడా వీళ్లు పోటీలోకి వచ్చేస్తారు. ఈ మధ్య ట్విట్టర్ రికార్డులు అభిమానులకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి.

హీరోల పుట్టిన రోజులు, ఇంకేవైనా సందర్భాలు వచ్చినపుడు హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మిలియన్లలో ట్వీట్లు వేయడం.. కొత్త రికార్డులు నెలకొల్పడాన్ని అభిమానులు ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్నారు. మే నెలలో ఎన్టీఆర్ అభిమానులు అతడి పుట్టిన రోజుకు 22 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పితే.. ఈ మధ్యే పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విష్ చెబుతూ.. ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టిన ఫ్యాన్స్ 28 మిలియన్ ట్వీట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టారు.

ఐతే మహేష్ ఫ్యాన్స్ మొన్న అతడి పుట్టిన రోజు నాడు ఈ రికార్డును డబుల్ ఫిగర్‌తో బద్దలు కొట్టేశారు. ఏకంగా 60 మిలియన్ ట్వీట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇది వరల్డ్ రికార్డ్ కూడా కావడం విశేషం. ఇప్పుడిక అందరి దృష్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద పడింది.

సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ అభిమానుల రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. 100 మిలియన్, అంటే 10 కోట్ల ట్వీట్లతో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలని పవర్ స్టార్ అభిమానులు ఫిక్సయిపోయారు. ఈమేరకు ఇప్పటికే అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది. సన్నాహాలు గట్టిగానే జరుగుతున్నాయి. కాబట్టి సెప్టెంబరు 2న కొత్త రికార్డు నమోదు కావడం లాంఛనమే అని భావిస్తున్నారు.

Next Story