ముఖ్యాంశాలు

  • మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు అశంపై సుప్రీంకోర్టులో విచారణ
  • ఆ లేఖలను రేపు కోర్టుకు సమర్పించాలి: ధర్మాసనం ఆదేశం
  • సుప్రీంకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా

ఢిల్లీ: సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై విచారణ జరిగింది. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దాదాపు గంటసేపు విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమా?అనే అంశాన్ని పరిశీలించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తనకు మెజార్టీ ఉందంటూ గవర్నర్‌కు సమర్పించిన లేఖను, దేని ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ కోశ్యారీ నిర్ణయం తీసుకున్నారో? సదరు లేఖలను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా ఈ రెండు లేఖలను కోర్టు ముందుంచాలని చెప్పింది. ఈ మేరకు సీఎం ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సోలిసిటర్‌ జనరల్‌ లేఖలు సమర్పించిన తర్వాతే బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. అనంతరం విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇరుపక్షాల వాదనలు

మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. శివసేన పక్షాన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు ఏర్పడ్డ శివసేన, బీజేపీ పొత్తు విఫలమైందని ధర్మాసననానికి వివరించారు. తిరిగి ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త కూటమి ఏర్పాటైందన్నారు. ఈ నెల 22న రాత్రి 7గంటలకు పార్టీల మధ్య పొత్తులు కొలిక్కి వచ్చాయని సిబల్‌ కోర్టుకు తెలిపారు. కాగా ఎవరికి తెలియకుండా 23న ఉదయం కొత్త ప్రభుత్వ ఏర్పాటైందని... రాష్ట్రపతి పాలన ఎత్తివేసి బీజేపీ నేత ఫడ్నవీస్‌తో సీఎంగా గవర్నర్‌ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారని చెప్పారు. ఈ రోజే బలనిరూపణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటులో కూడా పరిణామాలే చోటుచేసుకున్నాయని.. అక్కడ 24 గంటల్లో బలపరీక్షకు ఆదేశాలిచ్చారని ధర్మాసనానికి న్యాయవాది సిబల్‌ గుర్తుచేశారు. అవసరమైతే కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కూటమి రేపే బలనిరూపణను సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే గవర్నర్‌ కోష్యారీ వ్యవహరించిన తీరును కూడా సిబల్‌ ధర్మాసనం ముందు తప్పుబట్టారు. ఏ నిబంధనల ప్రకారం గవర్నర్‌ బీజేపీకి అవకాశం ఇచ్చారో తెలియజేయాలని కోరారు. ఎంతమంది ఎమ్మెల్యేల సంతకాల్ని రాత్రికి రాత్రే పరిశీలించారో తెలియజేయాలన్నారు.. కేబినెట్‌ నిర్ణయంతో అమలులోకి వచ్చిన రాష్ట్రపతి పాలన తిరిగి కేబినెట్‌ ఆమోదం లేకుండా ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు.

ఎన్సీపీ-కాంగ్రెస్ తరఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సింఘ్వీ కూడా ఇదే తరహా అంశాలను ధర్మాసనం ముందుంచారు. కర్ణాటక, గోవాలో జరిగిన పరిణామాల్ని, పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల్ని గుర్తు చేశారు. అనంతరం బీజేపీ తరఫున వాదనలు ప్రారంభించిన ముకుల్‌ రోహత్గి.. హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ఆదివారం రోజు అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. దీన్ని విచారణకు స్వీకరించాల్సిన అవసరం కూడా లేదని ముకుల్‌ రోహత్గి తన వాదనలను కోర్టు ముందుంచారు.

అంజి గోనె

Next Story