28 ఏళ్ల క్రితం పోయిన మంగళసూత్రం.. ఎన్నో ట్విస్టుల తర్వాత ఆమెను చేరింది.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2020 9:28 AM GMTమాములు దినాలలో జీఆర్పీ సిబ్బంది రైల్వేస్టేషన్లలో చోటుచేసుకునే ప్రమాదాలు, దొంగతనాల పరిష్కారంలో బిజీగా ఉంటారు. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఐదు నెలలుగా ముంబైలోని రైల్వేస్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో రైల్వే పోలీసులు పెండింగ్ ఫైళ్లను పరిష్కరించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ 28 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న బంగారపు మంగళసూత్రాన్ని జీఆర్పీ సిబ్బంది ఆమెకు అందజేశారు.
వివరాళ్లోకెళితే.. మంజుల షా అనే మహిళ.. 1991 డిసెంబరు 3న చర్చ్ గేట్ అప్ లోకల్ ట్రైన్‌లో మహిళా బోగీలో ప్రయాణించింది. అయితే.. ఆమె ప్రయాణంలో మంగళసూత్రాన్ని ఎవరో దొంగిలించారని ముంబై సెంట్రల్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏళ్లు గడిచినా ఫలితం లేకపోవడంతో ఆమె మంగళసూత్రం గురించి మరచిపోయారు.
అయితే.. రైల్వే పోలీసులు ఈ కేసులో 1991 డిసెంబరు 16న ఫాతిమా అనే మహిళను పట్టుకుని.. ఆమె వద్ద నుండి మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ సమయంలో ఆమె కనీస సమాచారం అందుబాటులో లేకపోవడంతో ఆ మంగళసూత్రాన్ని రైల్వే పోలీసులు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. మంజల షా సంప్రదించినప్పుడు హ్యాండోవర్ చేయోచ్చని ఎదురు చూశారు.
అయితే.. ఎంతకాలమైనా మంజుల తమను సంప్రదించకపోవడంతో.. రైల్వే పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న మంగళసూత్రాన్ని కోర్టుకు అప్పగించారు. అయితే.. 2015లో కోర్టు ఆ మంగళ సూత్రాన్ని ఫిర్యాదుదారుకు అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు ఫిర్యాదుదారు మంజుల షా చిరునామా కోసం ప్రయత్నించారు.
అయితే.. పోలీసులకు ఎంత గాలించినా ఆమె చిరునామా మాత్రం తెలియరాలేదు. దీంతో ఆ మంగళసూత్రం కోర్టు కస్టడీలోనే ఉంది. కాగా.. నాలుగేళ్ల అనంతరం ఇప్పుడు పోలీసులకు మంజుల కుమార్తె రీమా అడ్రస్ దొరికింది. దీంతో పోలీసులు మంజుల కొత్త చిరునామా తెలుసుకోగలిగారు.
తన తల్లి మంజుల 15 ఏళ్ల క్రితం పూణెకు షిఫ్ట్ అయ్యారని, ఆమెకు ఇప్పుడు 80 ఏళ్లు వచ్చాయని రీమా తెలిపింది. వృద్ధాప్యం కారణంగా ఆమె ఎక్కడికీ తిరగలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొంది. దీంతో పోలీసులు పూణెలోని మంజుల నివాసానికి వెళ్లి.. ఆ మంగళసూత్రాన్ని ఆమెకు అందజేశారు. దీంతో 28 ఏళ్ల క్రితం మంజుల పోగొట్టుకున్న మంగళసూత్రం ఆమెను చేరింది.