శ్రీశైలం అగ్ని ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య

By సుభాష్  Published on  21 Aug 2020 10:49 AM GMT
శ్రీశైలం అగ్ని ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను బయటకు తీశారు. మృతులు అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌లు మోహన్‌రావు, ఉజ్మ ఫాతిమా, సుందర్‌గా గుర్తించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. పొగల వల్ల పలువురు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అస్వస్థకు గురవుతున్నారు. గురువారం అర్థరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముందుగా ప్యానల్‌ బోర్డులో మంటలు చెలరేగి జలవిద్యుత్‌ కేంద్రం మొత్తం వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్‌ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 15 మంది సిబ్బంది సొరంగ మార్గం ద్వారా బయటపడ్డారు. సహాయక సిబ్బందిని మరో ఆరుగురిని రక్షించారు. మిగిలిని 9 మంది లోపల చిక్కుకుపోయారు. ఇక తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్ శర్మన్‌ తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మంటలను ఆర్పేందుకు దాదాపు 12 గంటలకుపైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 7 టన్నెల్స్‌ ఉండగా, ఒకటిన్నర టన్నెల్‌ వరకే రెస్క్యూ టీమ్‌ వెళ్లగలిగింది. లోపల చిక్కుకుపోయిన వారి చెప్పులు, జర్కిన్లు, ఇతర వస్తువులను రెస్య్కూ టీమ్‌ గుర్తించింది.

అయితే విత్యుత్ సరఫరా అయితేనే రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. ఇంకో రెండు గంటల పాటు ఆపరేషన్‌ సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పొగ, మంటలు తాళలేక సిబ్బంది టన్నెల్‌ లోపలికి పరుగులు తీసినట్లు భావిస్తున్నారు రెస్క్యూ టీమ్‌ సిబ్బంది. ఇక యంత్రాలను పెట్టి పొగను బయటికి పంపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సీఎం జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి

ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని అభివర్ణించారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Next Story