శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

By సుభాష్  Published on  21 Aug 2020 2:49 AM GMT
శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీశైలం ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ జెన్‌కో మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్‌ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మొత్తం ఆరు యూనిట్లలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. పొగలు రావడాన్ని గమనించిన డీఈ పవన్‌కుమార్‌తో పాటు ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది కొందరు వెంటనే బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో శుక్రవారం తెల్లవారుజాము వరకు మంటలు అదుపులోకి వచ్చాయి.

దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, ఫైర్‌ సిబ్బంది లోపల చిక్కకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో లోపల 30 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 15 మంది సొరంగం మార్గం ద్వారా బయటపడ్డారు. మరో ఆరుగురిని రక్షించగా, మిగతా 9 మంది లోపల చిక్కుకుపోయారు.

అగ్నిప్రమాదంలో గాయపడిన డీఈ పవన్‌కుమార్‌, ప్లాంట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ, డ్రైవర్‌ పాలంకయ్య, కృష్ణారెడ్డి, వెంకటయ్య, ఈటలపెంట జెకో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటన స్థలానికి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు చేరుకుని పరిశీలించారు. విద్యుత్‌ కేంద్రంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో లోపల ఉన్న సిబ్బంది శ్వాస ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి తెలిపారు.

Next Story