కరోనా మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేయడమే వారు చేసిన నేరమా..?
By Medi Samrat Published on 6 July 2020 1:47 PM GMTకరోనా మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేయడమే వారు చేసిన నేరమా..? వీధిలోకి రానివ్వని గ్రామస్తులు.. నడి బజార్లో వదిలేసిన అధికారులు.. దీంతో రెండు రోజులుగా నిద్రాహారాలు లేక అల్లాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు గాథ ఇది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి గ్రామం లో కోవిద్ బారినపడి చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు టెక్కలి కి చెందిన పారిశుద్ధ్య కార్మికులు హాజరయ్యారు.
వీరిని స్థానికంగా ఉన్న అధికారులు పంపించారు. విధులు ముగించుకుని టెక్కలి గ్రామానికి రాగా.. వీధిలో వారు పరీక్షలు నిర్వహించిన తర్వాత రావాలని చెప్పి అడ్డుకున్నారు. అనంతరం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు టెక్కలి పాత బస్టాండ్ లో ఉన్న అంబేద్కర్ ఆడిటోరియం వద్ద ఉండాలని చెప్పి వెళ్లిపోయారు.
రెండు రోజులు అవుతున్నా కనీసం మంచినీరు ఇచ్చే నాథుడే కరువయ్యారు. ఆకలి కేకలు తట్టుకోలేక రోడ్డుపై వెళ్తున్న వారికి కనీసం వాటర్ బాటిల్ డబ్బులు ఇచ్చినా తెచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు మీడియాను ఆశ్రయించారు. ఈ విషయం తెలియడంతో టెక్కలి ఎస్ఐ గణేష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఉన్న క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులైనా కనీస ఆహారం కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.