టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ రెండో విజ‌యం

Team India Win By 56 Runs against netherlands in ICC T20 World Cup 2022.టి20 ప్రపంచ‌క‌ప్2022లో టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2022 10:52 AM GMT
టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ రెండో విజ‌యం

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టి20 ప్రపంచ‌క‌ప్2022లో టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. గురువారం నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 56 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 180 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నెద‌ర్లాండ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 123 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. నెదర్లాండ్స్ బ్యాట‌ర్ల‌లో ఐదుగురు బ్యాట‌ర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియ‌న్‌కు చేరారు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, అర్ష్‌దీప్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అశ్విన్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ష‌మీ ఓ వికెట్ తీశాడు.

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌(9) మ‌రోసారి నిరాశ ప‌ర‌చ‌గా.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(53) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును న‌డిపించాడు. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్‌, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ (62 నాటౌట్‌) త‌న ఫామ్‌ను కొన‌సాగించ‌గా.. మిస్ట‌ర్ 360 డిగ్రీస్ సూర్య‌కుమార్ యాద‌వ్ (51 నాటౌట్‌) నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కోహ్లీ, సూర్య కుమార్ అభేధ్యంగా మూడో వికెట్‌కు 96 ప‌రుగుల భాగ‌స్వామ్యం నిర్మించారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో మీకెరెన్‌, క్లాసెన్ చెరో వికెట్ తీశారు.

Next Story
Share it