ఐపీఎల్ సీజన్ ప్రారంభం మ్యాచ్ మినహా వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై రెయిజ్ అయింది. హైదరాబాద్ ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. 245 పరుగుల టార్గెట్‌ను 18.3 ఓవర్లలోనే సన్ రైజర్స్ చేధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగడంతో సన్ రైజర్స్ అకౌంట్‌లో మరో విజయం నమోదు అయింది.
కాగా, టాస్ గెలిచి ముందుగా పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ప్రియాన్స్ ఆర్యా(36), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(42), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(82), నేహాల్ వధేరా(27)లు దంచికొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 245 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశారు.
ఇక లక్ష్య ఛేదనలో హైదరాబాద్ మొదటి నుంచే దూకుడు ప్రదర్శించింది. హెడ్(66), అభిషేక్(141), క్లాసేన్(21)తో రఫ్పాడించారు. దీంతో 245 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, చాహల్ తలో వికెట్ తీశారు. వరుస విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్‌కు బ్రేక్ వేయడమే కాకుండా.. ఈ సీజన్‌లో హైదరాబాద్ రెండో విక్టరీని నమోదు చేసింది.