సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారతజట్టు పోరాడుతోంది.
By Medi Samrat Published on 19 Oct 2024 5:27 AM GMTబెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారతజట్టు పోరాడుతోంది. పంత్ తో కలిసి బ్యాటింగ్ మొదలుపెట్టిన సర్ఫరాజ్ సెంచరీ బాదాడు. ఇది సర్ఫరాజ్ టెస్ట్ కెరీర్ లో మొదటి సెంచరీ. శనివారం M చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టు 4వ రోజు సర్ఫరాజ్ ఖాన్ తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో బెంచ్‌లో ఉన్న సర్ఫరాజ్ తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.
ముంబై బ్యాటర్ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు బంతుల్లోనే డకౌట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్‌లో సెంచరీతో అద్భుతంగా ఆడాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత అతను జట్టులోకి వచ్చాడు. భారీ సెంచరీలు చేయడంలో పేరుగాంచిన సర్ఫరాజ్, బెంగళూరు టెస్టులో భారత్‌ను గెలిపించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు.
57వ ఓవర్‌లో, టిమ్ సౌథీ వేసిన బంతిని సర్ఫరాజ్ బౌండరీ కొట్టి సెంచరీ పూర్తీ చేసుకున్నాడు. ఒక భారత బ్యాటర్ ఒకే టెస్టులో డకౌట్, ఆ తర్వాత సెంచరీ నమోదు చేయడం ఇది 22వ సారి. చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ కూడా ఇదే ఫీట్ ను సాధించాడు. న్యూజిలాండ్‌పై డకౌట్ తర్వాత సెంచరీ చేసిన మరొక భారతీయ బ్యాటర్ శిఖర్ ధావన్. ఆక్లాండ్‌లో ధావన్ మొదటి ఇన్నింగ్స్ లో 0, రెండో ఇన్నింగ్స్ లో 115 పరుగులు చేశాడు.