గంభీర్ తో గొడవలా..? రోహిత్ సమాధానం ఇదే..!
భారత మెన్స్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో ఎలాంటి గొడవలు లేవని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు.
By Medi Samrat Published on 18 Jan 2025 9:15 PM ISTభారత మెన్స్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో ఎలాంటి గొడవలు లేవని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. తమ మధ్య అన్నీ బాగున్నాయన్నారు. వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్‌లో పురుషుల T20 ప్రపంచ కప్ తర్వాత ప్రధాన కోచ్ పదవి నుండి రాహుల్ ద్రవిడ్ నిష్క్రమించినప్పటి నుండి రోహిత్- గంభీర్ కలిసి పనిచేస్తున్నారు. గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లను భారత్ వరుసగా కోల్పోయింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ నుండి ఊహించని విధంగా అవుట్ అయింది.
ఇంగ్లండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే సిరీస్‌లకు భారత జట్టులను శనివారం ప్రకటించారు. విలేకరుల సమావేశంలో రోహిత్ గంభీర్‌పై తన అభిప్రాయాన్ని బయట పెట్టారు. మేం ఏం చేయాలనుకుంటున్నాం అనే విషయంలో మా ఇద్దరికీ చాలా క్లారిటీ ఉంది.. నేను ఇక్కడ కూర్చుని తెరవెనుక ఏమి జరుగుతుందో, ప్రతి ఆటను వ్యూహాత్మకంగా చర్చించను. కానీ గౌతమ్ గంభీర్ ఆ విషయంలో చాలా ఆలోచిస్తారు. ఒకసారి మేము ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినప్పుడు, గంభీర్ మైదానంలో కెప్టెన్ ఏమి చేస్తున్నాడో మాత్రం ఆలోచిస్తాడని రోహిత్ వివరించారు. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత తాము జట్టు జయాపజయాల గురించి మాత్రమే ఆలోచిస్తామని రోహిత్ వెల్లడించారు.