క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..!

పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఉస్మాన్ షిన్వారీ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By -  Medi Samrat
Published on : 9 Sept 2025 7:28 PM IST

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..!

పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఉస్మాన్ షిన్వారీ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల షిన్వారీ మొత్తం 34 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించి 48 వికెట్లు పడగొట్టాడు. ఉస్మాన్ షిన్వారీ ఆరేళ్ల క్రితం జాతీయ జట్టు తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. 2013, 2019 మధ్య మూడు ఫార్మాట్లలో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన షిన్వారీ, లీగ్ క్రికెట్‌లో కొనసాగుతానని చెప్పాడు. షిన్వారీ ఒక టెస్టు, 17 వ‌న్డేలు, 16 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

'అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.. పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం.. కానీ ఇప్పుడు తదుపరి తరానికి చోటు కల్పించాల్సిన సమయం వచ్చింది. ఆటతో, నా అభిమానులతో సన్నిహితంగా ఉండటానికి నేను లీగ్ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాను. నా అభిమానుల ప్రేమ, మద్దతు నాకు సర్వస్వం. షిన్వారీ పోస్ట్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రిప్లై ఇచ్చింది. అతని రిటైర్మెంట్‌ను ధృవీకరించింది. ఉస్మాన్ షిన్వారీకి ధన్యవాదాలు' అని పీసీబీ బదులిచ్చింది.

ఉస్మాన్ షిన్వారీ 2013లో శ్రీలంకపై తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. అక్టోబరు 2017లో షార్జాలో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. డిసెంబర్ 2019లో షిన్వారీ శ్రీలంకతో తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు. వన్డేల్లో 34 వికెట్లు, టీ20లో 13 వికెట్లు తీశాడు.

వెన్ను గాయం కారణంగా ఉస్మాన్ షిన్వారీ కెరీర్ ప్రభావితమైంది. షిన్వారీ చివరిసారిగా పాకిస్థాన్ దేశవాళీ టోర్నమెంట్ నేషనల్ టీ20 కప్‌లో ఆడాడు. క్వెట్టా రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. షిన్వారీ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.

Next Story