ప్రపంచకప్ కోసం భార‌త్ వ‌చ్చే ముందు బాబర్ ఆజం కీల‌క వ్యాఖ్య‌లు

ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. టీమ్‌లు భారత్‌కు రావడం ప్రారంభించాయి.

By Medi Samrat  Published on  26 Sept 2023 3:45 PM IST
ప్రపంచకప్ కోసం భార‌త్ వ‌చ్చే ముందు బాబర్ ఆజం కీల‌క వ్యాఖ్య‌లు

ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. టీమ్‌లు భారత్‌కు రావడం ప్రారంభించాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కూడా భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. 2016లో భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ పాల్గొన్న తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు తొలిసారిగా భారత్‌కు రానుంది. అయితే తొలిసారి బాబర్ అజామ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే తమ బృందానికి వీసా ఆలస్యంగా ఇచ్చారని పీసీబీ ఫిర్యాదు చేసింది. కానీ సోమవారం సాయంత్రం వీసా జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. బుధవారం ఉదయం పాక్ జట్టు హైదరాబాద్‌కు రానుంది. కాగా, భారత్‌కు వ‌చ్చేముందు పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ మీడియాతో మాట్లాడుతూ.. తన అభిప్రాయాలను వెల్లడించాడు.

జట్టుగా మా మనోబలం చాలా ఎక్కువ అని లాహోర్‌లో బాబర్ ఆజం అన్నాడు. మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము. స‌త్తా చాటేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. తన కోసం ప్రార్థించాలని పాక్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. 2023 ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ఆశించినంత గొప్ప‌గా లేదు. దీనికి సంబంధించి బాబర్ ఆజం మాట్లాడుతూ.. ఈ ఓటమి జట్టు నేర్చుకునేందుకు ఉపయోగపడిందని అన్నాడు. ఆసియా కప్‌లో మేం రాణించలేకపోయామని.. అయితే దాని నుంచి నేర్చుకున్నామని అన్నాడు. మేము మా తప్పులను ఎత్తి చూపడమే కాదు.. బలహీనతలను ఎలా పరిష్కరించాలో కూడా మాట్లాడుకుంటామ‌ని తెలిపాడు. ఆసియాకప్‌లో జట్టు వ్యూహం వేరుగా ఉందని.. అయితే ప్రపంచకప్‌లో మాత్రం భిన్నమైన వ్యూహంతో మైదానంలోకి దిగుతామని బాబర్ ఆజం అన్నాడు. భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. మేము దానిపై నిఘా ఉంచుతాము. పాకిస్తాన్‌కు ఏది ఉత్తమమైనదో.. మేము అదే సన్నద్ధతతో మ్యాచ్‌లోకి ప్రవేశిస్తామని అన్నాడు.

పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ఒక్కసారి మాత్రమే గెలుచుకుంది. 1992లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. పాక్ జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తర్వాత 1999లో ఫైనల్‌కు చేరిన పాక్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి వన్డే ప్రపంచకప్‌లో తొలిసారిగా బాబర్ ఆజం కెప్టెన్‌గా కనిపించనున్నాడు. ఇది మాత్రమే కాదు, బాబర్ ఆజం మొదటిసారి క్రికెట్ ఆడటానికి భారతదేశానికి వస్తున్నాడు. ఈ అనుభవం అతనికి పూర్తిగా కొత్తది. మరి ఈసారి జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Next Story