ఘోర ఓట‌మి.. భారత్‌లో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్

పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది

By Medi Samrat  Published on  26 Oct 2024 4:26 PM IST
ఘోర ఓట‌మి.. భారత్‌లో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్

పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి, భారత్‌లో తొలిసారిగా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌లో భారత్ ఓడిపోయింది.

న్యూజిలాండ్‌కు ముందు 2012లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ భారత్‌ను ఓడించింది. అప్పటి నుండి, టీమ్ ఇండియా స్వదేశంలో విజయాలు సాధిస్తూనే ఉంది. కానీ ఆ విజయాల పరంపరకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. స్వదేశంలో భారత జట్టు వరుసగా 18 సిరీస్‌లను గెలుచుకుంది. ఈ ఓట‌మితో విజయాల పరంపర ఆగిపోయింది.

న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యంలో ఉంది.. దాని ఆధారంగా కివీస్ జట్టు భారత్‌కు 359 పరుగుల లక్ష్యాన్ని అందించింది. రెండున్నర రోజుల స‌మ‌యం ఉన్నా కూడా టీమ్ ఇండియా ఈ స్కోరు ఛేదించలేక ఓడిపోయింది.

టీమ్ ఇండియా తొలుత మంచి స్థితిలో ఉన్నట్లు అనిపించింది. దీనికి కారణం యశస్వి జైస్వాల్-శుభ్‌మన్ గిల్. రోహిత్ శర్మ తొందరగా ఔట్ అవ‌డంతో వీరిద్దరూ జట్టు బాధ్యతలు చేపట్టారు. స్కోరు 96 వద్ద గిల్ (23)ను మిచెల్ సాంట్నర్ అవుట్ చేశాడు. యశస్వి అవతలి వైపు నుండి తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. యశస్వి ఆడుతున్న తీరు చూస్తే సెంచరీ పూర్తి చేస్తాడని అనిపించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లానే ఈ ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ను శాంట్నర్ ఇబ్బంది పెట్టాడు. శాంట్నర్ యశస్విని సెంచరీ పూర్తి చేయనీయ‌లేదు. యశస్వి 65 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ నుంచి మళ్లీ భారత్ వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి.

రిషబ్ పంత్ (0) రనౌట్ కాగా, 17 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ సాంట్నర్ బౌలింగ్‌లో అవుట‌య్యాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా సాంట్నర్ స్పిన్ వ‌ల‌లో చిక్కుకున్నాడు. సర్ఫరాజ్ తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వికెట్‌ తీసి భారత్‌ ఆశలకు గ్లెన్‌ ఫిలిప్స్‌ గట్టి దెబ్బ తీశాడు. జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కలిసి జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా మరోసారి ఈ భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టడంలో సాంట్నర్ విజయం సాధించాడు. సాంట్నర్ అశ్విన్‌ను అవుట్ చేశాడు. అశ్విన్ 18 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత ఆకాశ్ దీప్ కూడా ఔట‌య్యాడు. రవీంద్ర జడేజాను ఔట్ చేయడం ద్వారా అజాజ్ పటేల్ భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు. జడేజా 84 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సాంట్నర్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అజాజ్ పటేల్ రెండు వికెట్లు, ఫిలిప్స్ ఒక వికెట్ తీశారు.

Next Story