పుణెలోని మెరైన్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. అతనిపై బాస్కెట్‌బాల్ బ్యాక్‌బోర్డ్ పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ప్రాణాలను కాపాడలేకపోయారు.
టోలానీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి విశాల్ వర్మ. ఆదివారం ఉదయం క్యాంపస్‌లో వాకింగ్‌కు వెళ్లాడు. అతను బాస్కెట్‌బాల్ హూప్‌కు వేలాడుతూ పుల్-అప్స్ చేస్తుండగా.. ఆ ఫ్రేమ్ మొత్తం అతనిపై కూలిపోయింది. దీంతో అతని తల నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. క్యాంపస్‌లోని తోటి విద్యార్థులు, సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు.
విశాల్ లింక్డ్‌ఇన్ ఖాతా ప్రకారం.. అతను ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీకి చెందినవాడు. అతను 2024లో పూణేలోని ఆ సంస్థలో చేరాడు. అతని నాలుగేళ్ల బీ.టెక్ కోర్సు 2028లో పూర్తి కావాల్సి ఉంది. టోలానీ మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీత్ ఈ సంఘటనను "తీవ్ర విచారం" అని అభివర్ణించారు. ఏం తప్పు జరిగిందో తాము విచారిస్తామని ఆయన చెప్పారు. ఫ్రేమ్ తుప్పు పట్టిందా లేదా ఫిట్టింగ్స్‌లో పెద్ద లోపం ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని ఇన్‌స్పెక్టర్ సంతోష్ పాటిల్ చెప్పారు.