ఫైనల్స్‌లోకి ప్రవేశించిన కేకేఆర్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మ‌రో ఛాన్స్ ఉందిగా...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది

By Medi Samrat  Published on  22 May 2024 7:30 AM IST
ఫైనల్స్‌లోకి ప్రవేశించిన కేకేఆర్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మ‌రో ఛాన్స్ ఉందిగా...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో హైదరాబాద్ క్వాలిఫయర్-2లో విజయం సాధించి టైటిల్ మ్యాచ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

బౌలర్లు రాణించ‌డం.. వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ల అద్భుత అర్ధ సెంచరీలతో క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫైనల్లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ రాహుల్ త్రిపాఠి 55 పరుగుల సాయంతో 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంత‌రం కేకేఆర్ ఛేద‌న‌లో.. శ్రేయాస్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు(58), 28 బంతుల్లో వెంకటేష్ అయ్యర్ 5 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 51 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆధారంగా 13.4 ఓవర్లలో రెండు వికెట్లకు 164 పరుగులు చేసి విజ‌యం సాధించింది.

క్వాలిఫయర్-1లో అజేయంగా నిలిచిన KKR తన రికార్డును నిలబెట్టుకుంది. IPL 2024లో ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఓటమి పాలైనప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించని హైదరాబాద్ జట్టు టైటిల్ మ్యాచ్‌లోకి ప్రవేశించేందుకు మరో అవకాశం ఉంది. ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో విజేతగా నిలిచిన జట్టుతో హైదరాబాద్‌ శుక్రవారం క్వాలిఫయర్-2లో తలపడనుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది.

Next Story