క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీ20 ప్రపంచకప్ హీరో
Joginder Sharma India’s 2007 T20 World Cup hero announces retirement.టీమ్ఇండియా క్రికెటర్ జోగిందర్ శర్మ క్రికెట్‌కు
By తోట వంశీ కుమార్
టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం అన్ని రకాల అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా 39 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ వెల్లడించాడు. టీమ్ఇండియా తరుపున 4 టీ20లు, 4 వన్డేలు మాత్రమే ఆడాడు. టీ20ల్లో 4, వన్డేల్లో ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 16 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు.
జోగిందర్ తన కెరీర్‌లో టీమ్ఇండియాకు పెద్దగా ఆడనప్పటికీ సగటు క్రికెట్ అభిమానులకు అతడు సుపరిచితమే. అందుకు 2007 టీ20 ప్రపంచకప్ కారణం. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను జోగిందర్ శర్మనే వేశాడు. సీనియర్ బౌలర్లను కాదని అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని జోగిందర్‌కు ఆఖరి వేసే బాధ్యతను అప్పగించాడు. ఉత్కంఠభరిత పోరులో అద్భుతంగా ఆఖరి ఓవర్‌ను వేసిన జోగిందర్ 5 పరుగుల తేడాతో భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో భారత్ తొలి సారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
అయితే.. ప్రపంచకప్ గెలిచిన జట్టులో దాదాపుగా అందరూ చాలా కాలం పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా జోగిందర్ శర్మకు ఆ అవకాశం దక్కలేదు. దేశవాలీ క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో నేడు అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.
జోగిందర్ శర్మ సందేశం కేవలం తన క్రికెట్ ప్రయాణంలో తనతో పాటు కలిసి వచ్చిన వ్యక్తులకు మాత్రమే కాకుండా తన కెరీర్‌లో ఒడిదుడుకుల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అభిమానులతో గడిపిన క్షణాలను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, వారి మద్దతు ఎప్పుడూ తనకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పాడు.
క్రికెట్ మైదానంలో తన నైపుణ్యాలను ప్రదర్శించడానికి తనకు అవకాశాలను అందించినందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI), హర్యానా క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్ మరియు హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన కలను నిజం చేయడంలో సహకరించినందుకు సహచరులు, కోచ్‌లు, మెంటర్లు మరియు సహాయక సిబ్బందికి కూడా అతను కృతజ్ఞతలు తెలిపాడు.