డెత్ ఓవర్ల గండం గట్టెక్కేనా..? దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టీ20 నేడు
India vs South Africa 1st T20 Match Today.టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆఖరి టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సిద్దమైపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Sep 2022 7:27 AM GMTటీ20 ప్రపంచకప్‌కు ముందు ఆఖరి టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సిద్దమైపోయింది. ప్రపంచకప్‌కు ముందు ఇదే ఆఖరి సిరీస్ కావడంతో జట్టు కూర్పును పరీక్షించుకోవడానికి యాజమాన్యానికి ఇదే ఆఖరి అవకాశం. బ్యాటింగ్ విషయంలో పెద్దగా సమస్యలు లేకున్నా డెత్ ఓవర్లలో బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే నేటి నుంచి దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ నేపథ్యంలో హార్థిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి ఇవ్వగా.. కరోనా కారణంగా షమీ ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో బ్యాటర్లంతా రాణించడంతో ఈ అంశంలో భారత్‌కు పెద్దగా ఇబ్బందులు లేవు. ఓపెనర్లు రోహిత్ , రాహుల్, వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లు ఫామ్ అందుకోవడం ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు పెద్ద సానుకూలాంశం. మిడిల్ ఆర్డర్‌లో 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నాడు. ఫినిషర్ దినేశ్ కార్తిక్ క్రీజులో మరింత సమయం గడపాల్సి ఉంది. కార్తిక్‌తో పాటు పంత్‌కు తుది జట్టులో చోటు దక్కొచ్చు.
ప్రపంచకప్‌కు స్టాండ్ బై కూడా అయిన దీపక్ చాహర్‌కు గత సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఈ మూడు మ్యాచుల్లో రొటేషన్ చేయాలని జట్టు భావిస్తే అతడికి ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. అర్షదీప్ పునరాగమనం స్లాగ్ ఓవర్లలో బౌలింగ్‌ను బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. గాయం నుంచి కోలుకున్నబుమ్రా లయను అందుకోవాల్సి ఉంది. అశ్విన్‌కు కూడా ఈ సిరీస్‌లో ఆడే అవకాశం దక్కొచ్చు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడటంతో జట్టులో చోటు దక్కించుకున్న అక్షర్ ఆసీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా ఆడాడు. అతడి నుంచి మరోసారి అలాంటి ప్రదర్శననే జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
మరోవైపు బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. ఆ జట్టులో కూడా ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపం మార్చగల ఆటగాళ్లు ఉన్నారు. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, మార్‌క్రమ్, బవుమా, రాసో, యువ ఆటగాడు స్టబ్స్ తో కూడిన బ్యాటింగ్ లైనప్ ఆ జట్టు సొంతం. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అక్కడికి, ఇక్కడికి పరిస్థితుల్లో తేడా ఉన్నప్పటికీ, ప్రత్యర్థిపై అవగాహన పెంచుకునేందుకు ఈ సిరీస్‌ను రెండు జట్లు ఉపయోగించుకోనున్నాయి.