దాయాదుల పోరు నేడే.. ప్రతీకారేచ్ఛతో రోహిత్ సేన
India vs pakistan Match in T20 world cup Today.భారత్, పాకిస్తాన్ జట్లు టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి పోరులో అమీతుమీ
By తోట వంశీ కుమార్ Published on 23 Oct 2022 3:10 AM GMTక్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి పోరులో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గతేడాది ఇదే టోర్నీలో పాక్ చేతిలో భారత జట్టు ఓటమిని అభిమానులు అంత సులువుగా ఎవరూ మరిచిపోరు. అంతేకాదు.. ఇటీవల ఆసియా కప్‌లో సైతం పాక్ గట్టి దెబ్బే కొట్టింది. లీగ్ మ్యాచ్‌లో ఓడినా.. సూపర్-4లో విజయం సాధించి టోర్నీలో రోహిత్ సేన ఫైనల్ అవకాశాలను దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి అన్నింటికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సగటు అభిమాని కోరుకుంటున్నాడు.
భారత టాప్-3 బ్యాటర్ల రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు ఎంతో కీలకం. వీరు టోర్నీలో ఎలా ఆడతారు అన్న దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీరి గురించి చెప్పాల్సిన పని లేదు కానీ.. గత కొంతకాలంగా ఈ ముగ్గురు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇటీవల కోహ్లీ ఫామ్ అందుకోగా.. రాహుల్ కూడా కొంచెం లయ అందుకున్నట్లే కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ అడపాదడపా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికీ నిలకడ లోపించింది.
టాప్ ఆర్డర్‌లో ఈ ముగ్గురులో ఏ ఇద్దరు రాణించి మంచి పునాది వేసినా.. మిగతా పనిని సూర్యకుమార్ యాదవ్, హర్థిక్ పాండ్యా చూసుకుంటారు. పోయిన సారి పాక్ చేతిలో భారత ఓటమికి టాప్ ఆర్డర్ వైఫల్యమే కారణం. ఇక పేస్ బౌలింగ్‌లో షమీ, భువనేశ్వర్, అర్షదీప్‌లు ఖాయం. అక్షర్‌కు తోడుగా అశ్విన్, చహల్‌లో ఒక్కరే ఆడే అవకాశం ఉంది.
పాక్‌కు బౌలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవు. షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, రవూఫ్ వంటి ప్రమాదకర పేసర్లు ఆ జట్టు సొంతం. స్పిన్నర్లు నవాజ్, షాదాబ్ ఆసియా కప్‌లో భారత్‌ను గట్టి దెబ్బ తీశారు. అయితే.. బ్యాటింగ్‌లో తడబాటు ఉంది. ఓపెనర్లు రిజ్వాన్, కెప్టెన్ బాబర్ భారీగా పరుగులు చేస్తున్నా స్ట్రయిక్ రేట్ పేలవం, మసూద్ ఫామ్‌లో ఉండగా గాయంతో ఫఖార్ జమాన్ దూరం అయ్యాడు. హైదర్ అలీ, అసిఫ్ అలీ, ఇఫ్తికార్‌లు ఎప్పుడు ఎలా రాణిస్తారో చెప్పలేం.
మొత్తంగా అనిశ్చితి పెట్టింది పేరైనా పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మరోసారి చేదు ఫలితం తప్పదు.
పిచ్, వాతావరణం
మెల్‌బోర్న్ పిచ్ పేస్‌కు సహకరించనుంది. ఆదివారం 40శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గు చూపనుంది. మైదానం పెద్దది కావడంతో భారీ షాట్లు ఆడటం కాస్త కష్టమే.