దంచికొట్టిన శ్రేయస్.. మెరిసిన జడేజా, శాంసన్
India Beat Sri Lanka by 7 Wickets Take Unassailable 2-0 Lead.ధర్మశాల వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన
By తోట వంశీ కుమార్ Published on 27 Feb 2022 8:23 AM ISTధర్మశాల వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది. తొలుత లంక బాట్స్‌మెన్ల బాదుడుతో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగా.. తరువాత శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా దంచికొట్టడంతో టీమ్ఇండియా సునాయాసనంగా లక్ష్యాన్ని చేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమ్ఇండియా చేజిక్కించుకుంది. ఫలితంగా స్వదేశంలో వరుసగా ఏడో సిరీస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇరు జట్ల నామ మాత్రమైన చివరి మ్యాచ్ నేడు జరగనుంది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిషాంక (75; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. చివర్లో కెప్టెన్ దసున్ షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరిద్దరి ధాటిగా ఆడడంతో ఆఖరి 5 ఓవర్లలో లంక 80 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా, హర్షల్, చాహల్, జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే అంటే.. 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. శ్రేయస్ అయ్యర్ (44 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా.. సంజూ శాంసన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) లు చెలరేగి ఆడారు. చాలా రోజుల తరువాత జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్ తొలుత తడబడినా.. కుదురుకున్న తరువాత తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(1), ఇషాన్ కిషన్(16) లు విఫలం అయ్యారు.