కంగుతిన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఏం జరిగిందంటే..
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లదంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 29 Nov 2024 7:40 PM ISTఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లదంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లోనే జరిగేట్టయితే భారత జట్టు పాల్గొనదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వ్యవహారంపై బీసీసీఐ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసిందని, బీసీసీఐ చెప్పినట్టుగానే భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోవడంలేదని తెలిపారు. బీసీసీఐ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని, పాకిస్థాన్ లో భద్రతా పరమైన సమస్యలు ఎదురవుతాయని బీసీసీఐ ఆందోళన చెందుతోందన్నారు జైస్వాల్.
టీమిండియా పాకిస్థాన్ వెళ్లడంలేదన్న ప్రకటనల నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం హైబ్రిడ్ మోడల్ కు తాము అంగీకరించేది లేదని అంటోంది. తటస్థ వేదికలో నిర్వహించే హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకూడదని పాకిస్తాన్ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను, వేదికను ఖరారు చేసేందుకు ఐసీసీ కసరత్తు చేస్తోంది. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రారంభానికి మూడు నెలల కన్నా తక్కువ సమయం మిగిలి ఉన్నందున ICC ఇంకా మ్యాచ్‌ల తేదీలను ప్రకటించలేదు.
ఇదిలావుంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు సభ్యుల ముఖ్యమైన సమావేశం ఈ రోజు జరిగింది. ఈ వర్చువల్ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. దీంతో ఈరోజు నిర్ణయం వెలువడుతుందనుకున్న పీసీబీ కంగుతిన్నది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. త్వరలో మరోసారి సమావేశం కావాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే డిసెంబర్ 1న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత అతని స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు చేపట్టనున్నారు.
ANI నివేదిక ప్రకారం.. సభ్యులందరూ సమావేశంలో ఎటువంటి నిర్ణయానికి రాలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించలేదు. నివేదికల ప్రకారం, సమావేశానికి 12 మంది పూర్తి సభ్యులు, అసోసియేట్ దేశాల నుండి ముగ్గురు డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని శనివారం నిర్వహించే అవకాశం ఉంది. శనివారం కాకపోతే మరికొద్ది రోజుల్లో మళ్లీ సభ జరిగే అవకాశం ఉంది.