హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) శుభవార్త చెప్పింది. దాదాపు రెండున్నరేళ్ల తరువాత అంతర్జాతీయ మ్యాచ్‌కి హైదరాబాద్ అతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్ వేదికగా ఎంపికైంది. ఈ సిరీస్‌తో పాటు సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్, వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇందులో సెప్టెంబర్ 20న మొహాలీలో తొలి మ్యాచ్, నాగ్‌పూర్ (సెప్టెంబర్ 23), హైదరాబాద్ (సెప్టెంబర్ 25) మ్యాచ్‌లు జరుగనున్నాయి. మెగాటోర్నీకి ఎంపిక చేసిన జట్టు ఆసీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో మరో మూడు టీ20 మ్యాచ్‌ల్లో పోటీపడుతుంది.
ఆసీస్‌తో సిరీస్ అనంతరం సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల్లో భారత్ తలపడుతోంది. సెప్టెంబర్ 28, అక్టోబర్ 1, 3 తేదీల్లో జరిగే మూడు టీ20లను త్రివేండ్రం, గౌహతి, ఇండోర్‌లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో వరుసగా రాంచీ, లక్నో, ఢిల్లీలో మూడు వన్డేలు జరుగుతాయి.
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచ కప్ ఆరంభం కానున్ననేపథ్యంలో భారత జట్టు వీలైనన్ని ఎక్కువ టీ20లను ఆడేలా బీసీసీఐ ప్రణాళికలు రచించింది.