'శర్మ జీ కా బేటా' పుట్టినరోజు నేడు.. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డులు అతని సొంతం..!
'శర్మ జీ కా బేటా', 'హిట్‌మ్యాన్' వంటి విభిన్న పేర్లతో ప్రసిద్ధి చెందిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
By Medi Samrat Published on 30 April 2024 8:00 AM GMT'శర్మ జీ కా బేటా', 'హిట్‌మ్యాన్' వంటి విభిన్న పేర్లతో ప్రసిద్ధి చెందిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. అతడికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రముఖులు, సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 'హిట్‌మ్యాన్' తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. తద్వారా అతడు ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పేరుగాంచాడు.
భారత క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకోవాలని.. 2013 నుండి ఉన్న ICC టైటిల్ కరువును తీర్చాలని ఆశిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు. రోహిత్ శర్మ నుండి అభిమానులు అద్భుతమైన ప్రదర్శనను ఆశిస్తున్నారు.
ముందుగా రోహిత్ శర్మ 37వ పుట్టినరోజు సందర్భంగా అతడి ప్రపంచ రికార్డులను చూద్దాం. రోహిత్ రికార్డులను బద్దలు కొట్టడం బ్యాట్స్‌మెన్‌లకు చాలా కష్టం. ఒకసారి చూద్దాము.
1) వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు - ODI క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోని ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై ఒక డబుల్ సెంచరీ, శ్రీలంకపై రెండు డబుల్ సెంచరీలు సాధించాడు.
2) T20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు - రోహిత్ శర్మ T20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్. రోహిత్ శర్మ(190) తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(173) పేరిట ఉంది. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ తన సిక్సర్ల సంఖ్యను 200కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు.
3) టోర్నమెంట్‌లో అత్యధిక సెంచరీలు - 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. టోర్నీలో ఐదు సెంచరీలు సాధించాడు. సగటు 81 కాగా.. స్ట్రైక్ రేట్ 98.33. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 648 పరుగులు చేశాడు.
4) ODI క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు - రోహిత్ శర్మ ODI ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కలిగి ఉన్నాడు. నవంబర్ 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై హిట్‌మాన్ 264 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌కి ఇది రెండో డబుల్ సెంచరీ.
5) కెప్టెన్సీలో అత్యధిక IPL టైటిల్స్ - రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కు అత్యధిక IPL టైటిళ్లను అందించాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. రోహిత్ 2013, 2015, 2017, 2019 మరియు 2020లో ముంబైని IPL ఛాంపియన్‌గా నిలిపాడు. ఎంఎస్ ధోనీ కూడా తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించాడు.