'మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే'.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్‌

దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  20 April 2024 3:35 PM IST
మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్‌

దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ కార్నర్ మీటింగ్ లో ఆయ‌న మాట్లాడుతూ.. 1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆర్ఎస్ చేతిలోనే ఉంది. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప.. బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు.

దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానన్న రఘునందన్ రావును అడుగుతున్నా.. మేమంతా బస్సులేసుకుని దుబ్బాక వస్తాం.. నువ్వు తెచ్చిన నిధులేంటో.. చేసిన అభివృద్ధి ఏంటో చూపించమ‌న్నారు. పదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్నారు.. కేసీఆర్ సీఎం గా ఉన్నారు.. ఈ పదేళ్లలో వీళ్లు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాకే ఓట్లు అడగాలన్నారు.

కేసీఆర్ పని అయిపోయింది.. కారు కార్ఖానాకు పోయింది.. ఇక కారును తుక్కు కింద అమ్మాల్సిందేన‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు.. అదేమైనా నువు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి.. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు.. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించే ప్రజా పాలన మాది.. రూ.22,500 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నాం.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం.. మేం ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తుంటే.. కడుపు మండిన మోదీ, కేసీఆర్ కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని మండిప‌డ్డారు.

మేం పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంటే.. చూసి ఓర్వలేక కేసీఆర్, మోదీ కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నారు.. తెలంగాణ రైతులకు ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది.. వచ్చే పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్, హరీష్ హామీలు నెరవేర్చలేదు.. కానీ.. వందరోజుల్లోనే మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు.. పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమ‌న్నారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలను అందించే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ రైతుల భూములు గుంజుకున్న దుర్మార్గుడు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ఫైర‌య్యారు. మోదీ, కేడీ తొడుదొంగలు.. డిసెంబర్ లో కేడీని ఇంటికి పంపించాం.. ఇక ఇప్పుడు మోదీని ఇంటికి పంపించాలన్నారు. పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండానే.. బలహీన వర్గాల బిడ్డ నీలం మధును గెలిపించాల్సిన బాధిత మీపై ఉందన్నారు.

Next Story