బీఆర్ఎస్ మొదటి జాతీయ సభకు సర్వం సిద్ధం
BRS Nanded Meeting. బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో నిర్వహించనున్న తొలి సభకు మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణం
By Medi Samrat Published on 4 Feb 2023 1:00 PM GMTబీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో నిర్వహించనున్న తొలి సభకు మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. పార్టీ నాయకులు దగ్గరుండి సభాస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయించారు. నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షుడు, సీయం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేశారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తదితర నేతలు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గత వారం రోజులుగా నాందేడ్ లో మకాం వేసి ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ.. అన్నీ తానై సీయం కేసీఆర్ సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభ ఏర్పాట్లను చూస్తూనే.. విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ సర్పంచ్ లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తూ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణ అవశ్యకతను తెలియజేస్తూ.. బీఆర్ఎస్ ను ఆదరించాలని కోరుతున్నారు.
మన రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న నాందేడ్ జిల్లా కేంద్రంలో సభ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కాగలరని అంచనా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్ & నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు స్వచ్చంద తరలి వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా నాందేడ్ జిల్లా సరిహద్దు తెలంగాణ నియోజకవర్గాలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, జుక్కల్ తో పాటు నిర్మల్, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు సభకు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి.