ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు.. ఫోటో అదిరిపోయింది
All 16 Captains In One Frame Ahead Of T20 World Cup.కెప్టెన్స్ డే కార్యక్రమంలో 16 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.
By తోట వంశీ కుమార్ Published on 15 Oct 2022 2:13 PM ISTక్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజులు వచ్చేశాయి. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం నుంచి టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీ ఆరంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్నాయి. పొట్టి ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం కెప్టెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 16 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.
తాము ప్రపంచకప్‌కు ఎలా సన్నద్దం అయ్యామో అన్ని జట్ల కెప్టెన్లు మీడియాకు వివరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఒకే ఫ్రేమ్‌లో 16 మంది కెప్టెన్లు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
జట్టు సన్నద్దత గురించి భారత కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ టోర్నీలో భారత జట్టు కీలక ఆటగాడు బుమ్రా లేకుండానే బరిలోకి దిగుతోంది. దీనిపై హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. బుమ్రా నాణ్యమైన ఆటగాడు. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు గాయాలు అవుతుంటాయి. అవి ఆటలో సహజమే. బుమ్రా గాయం గురించి మేము చాలా మంది నిపుణులతో మాట్లాడాం. అయితే.. మాకు సానుకూల ఫలితం రాలేదు. ఫలితంగా ప్రపంచ కప్ కు అతడు దూరం అయ్యాడు. ఈ టోర్నీ మాకు చాలా ముఖ్యమైంది. అయితే..అతని కెరీర్ మాకు మరింత ముఖ్యం. అతని వయస్సు 28 సంవత్సరాలు మాత్రమే. అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. కాబట్టి.. మేము ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. వైద్య నిపుణులు కూడా అదే సూచించారు. మున్ముందు ఇంకా చాలా ఆడుతాడు. దేశాన్ని గెలిపిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ టోర్నీలో బుమ్రా లేకపోవడం మాకు కచ్చితంగా ఎదురు దెబ్బే' అని రోహిత్ అన్నాడు.
క్వాలిఫైయర్స్‌లో భాగంగా శ్రీలంక-నమీబియా జట్ల మధ్య జిలాంగ్‌లోని కార్డీనియా పార్క్ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్2022 టోర్నీకి తెరలేవనుంది. సూపర్12 స్టేజ్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్, కివీస్ జట్లు తలపడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23న దాయాది పాకిస్తాన్‌తో ఆడనుంది. నవంబర్ 13న టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. గెలిచిన జట్టుకు 1.6 మిలియన్ల డాలర్లు ప్రైజ్‌మనీ సొంతం కానుంది.