భారత జట్టు విజయంపై షాహిద్ అఫ్రిది కామెంట్స్
Afridi lauds India's performance vs Eng.ఇంగ్లాండ్ పై తొలి టి20లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమ్ఇండియా రెండో
By తోట వంశీ కుమార్ Published on 10 July 2022 2:53 PM ISTఇంగ్లాండ్ పై తొలి టి20లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమ్ఇండియా రెండో మ్యాచ్‌లోనూ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. ఈ క్రమంలో భారత జట్టు పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే.. భారత్ అంటేనే అక్కసు వెళ్ల గక్కే పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది సైతం టీమ్ఇండియా ఆటగాళ్లను అభినందించడం విశేషం. మరో మూడు నెల్లలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ను టీమ్ఇండియా గెలిచే అవకాశం ఉందని అఫ్రిది ట్వీట్ చేశాడు.
'ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టుపై భారత్ అద్భుతంగా ఆడింది. సిరీస్‌ను గెలిచేందుకు అన్ని అర్హతలు భారత జట్టుకు ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ చాలా బాగుంది. అందుకనే చెబుతున్నా ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ఫేవరేట్స్‌లో భారత్ తప్పకుండా ఉంటుంది 'అని అఫ్రిది ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
India have played outstanding cricket and deserve to win the series. Really impressive bowling performance, they'll surely be one of the favourites for the T20 World Cup in Australia https://t.co/5vqgnBYfIX
— Shahid Afridi (@SAfridiOfficial) July 9, 2022
కాగా.. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి భారత జట్టును పాకిస్థాన్ ఓడింది. ఇక ఆ ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటి ముఖం పట్టగా పాకిస్థాన్ సెమీస్ వరకు వెళ్లింది. సెమీస్‌లో పాకిస్థాన్‌ను ఆసీస్ ఓడించింది.