రోహిత్ ఎందుకు రిటైర్ కావాలి.?
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఊహాగానాలను తోసిపుచ్చాడు.
By Medi Samrat Published on 13 March 2025 4:45 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఊహాగానాలను తోసిపుచ్చాడు. దీంతో రోహిత్ శర్మ నిర్ణయం తప్పా లేదా అనే కొత్త చర్చ ప్రపంచ క్రికెట్‌లో ప్రారంభమైంది. చాలా మంది వెటరన్ ఆటగాళ్లు రోహిత్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ పేరు కూడా చేరింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవడానికి బలమైన కారణం లేదని ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. భారత కెప్టెన్‌ను ఆల్ టైమ్ గ్రేట్ వన్డే కెప్టెన్లలో ఒకరిగా పరిగణించవచ్చని ఎబి డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో.. టోర్నమెంట్ తర్వాత రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు వీడ్కోలు చెబుతాడని ఊహాగానాలు వెలువడ్డాయి.
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మాట్లాడుతూ.. ఇతర కెప్టెన్లతో పోల్చితే రోహిత్ విన్నింగ్ శాతం 74. మీరు మునుపటి కెప్టెన్ల చరిత్రను చూస్తే.. అలాంటి ఉదాహరణ ఎవరికి దొరుకుతుంది.? అని ప్రశ్నించారు. అతడు ఇంకా ఆడాలనుకుంటే, అతడు ఆల్ టైమ్ అత్యుత్తమ వన్డే కెప్టెన్లలో ఒకరిగా పరిగణించబడతాడని పేర్కొన్నాడు. తాను రిటైర్మెంట్ తీసుకోనని రోహిత్ శర్మ స్వయంగా చెప్పాడు.. పుకార్లు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. రోహిత్ ఎందుకు రిటైర్ కావాలి.? అతను కెప్టెన్సీ.. బ్యాటింగ్‌లో కూడా అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. అతడు ఫైనల్‌లో 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.. ఇది భారత్‌కు అద్భుతమైన ప్రారంభాన్ని అందించడమే కాకుండా విజయానికి పునాది కూడా వేసింది. రోహిత్ ఒత్తిడిలో ముందుకు వచ్చి జట్టును ముందుకు నడిపించాడు.. రోహిత్ శర్మ రికార్డులు అతని కథను చెబుతున్నాయని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.