మ్యాచ్ జ‌రుగుతుండ‌గా స్డేడియంలో ప్ర‌త్య‌క్ష‌మైన పాము..!

A Snake Stops Play in Guwahati. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ T20I లో పరుగుల వరద సాగింది

By Medi Samrat  Published on  3 Oct 2022 10:54 AM GMT
మ్యాచ్ జ‌రుగుతుండ‌గా స్డేడియంలో ప్ర‌త్య‌క్ష‌మైన పాము..!

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ T20I లో పరుగుల వరద సాగింది. మొత్తం 458 పరుగులు ఈ మ్యాచ్ లో సాధించారు. రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 16 పరుగుల తేడాతో నెగ్గింది. డేవిడ్ మిల్లర్ వీరోచిత సెంచరీ, డికాక్ పోరాటం చేసినా అవి వృథా అయ్యాయి. మిల్లర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డికాక్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. మార్ క్రమ్ 19 బంతుల్లో 33 పరుగులు చేశాడు. తొలుత టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 2-0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్ ఈ నెల 4న ఇండోర్ లో జరగనుంది.

ఈ మ్యాచ్ సమయంలో రెండు సార్లు అంతరాయం ఏర్పడింది. మొదట భారత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాగా.. రెండోది దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ సమయంలో ఏడో ఓవర్ ముగిసే సమయానికి, అవుట్‌ఫీల్డ్‌లో పాము కనిపించింది. ఆ పాము ఆటగాళ్లకు దగ్గరగా గడ్డిలో పాకుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఆ పామును తొలగించేందుకు గ్రౌండ్ సిబ్బంది కర్రలు, చేతిలో బకెట్‌తో మైదానంలోకి పరిగెత్తారు. ఎక్స్ట్రా కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆల్ రౌండర్ వేన్ పార్నెల్ వెంటనే పామును గుర్తించి మైదానంలో ఉన్న వారందరినీ అప్రమత్తం చేశాడు. ఇక పాము గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో కూడా మరో అంతరాయం కలిగింది. లైట్స్ సరిగా పని చేయకపోవడంతో మ్యాచ్ ను కొద్దిసేపు ఆపారు. ఫ్లడ్ లైట్స్ ఫెయిల్యూర్ కారణంగా ఇన్నింగ్స్ ను ఆపేసారు. లైట్లు వెలిగి మ్యాచ్ ప్రారంభం కావడానికి పది నిమిషాల పాటు ఆగిపోయింది. "ఇది మా నియంత్రణలో లేదు (ఫ్లడ్‌లైట్ వైఫల్యంపై). మేము తేరుకోడానికి కొంత సమయం ఇచ్చింది. మొదటి రెండు ఓవర్లలో మ్యాచ్ భారత్ కు అనుకూలంగా మారింది. పవర్‌ప్లేలో మాట్లాడుకోడానికి మాకు అవకాశం దొరికింది.' అని దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో అన్నాడు.



Next Story