మోదీకి భద్రతలో కోత.. విపక్షాలకు తిరుగులేని మాస్టర్ స్ట్రోక్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2020 1:19 PM ISTరాజకీయాల్లో ఇప్పటివరకూ చూడని ఎత్తుల్ని వేస్తూ.. విపక్షాలకు ఒక పట్టాన అర్థంకాని రీతిలో తయారయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటివరకూ దేశ ప్రజలకు తెలిసినంత వరకు అధికారంలో ఉన్న వారు తమకున్న భద్రతను మరింత పెంచుకుంటారు. కక్ష పూరిత రాజకీయాల వేళ.. తమ రాజకీయ ప్రత్యర్థులకు కల్పించే భద్రతను కోత పెడతారు. తర్వాతి కాలంలో విపక్షం అధికారపక్షంగా మారటం.. గతంలో వారు చేసిన దానికి బదులు తీర్చుకునే రోటీన్ స్టోరీ అందరికి తెలిసిందే.
ఈ మధ్యన ప్రియాంక మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులతో పాటు.. మాజీ ప్రధాని మన్మోహన్ కు భద్రతా సిబ్బందిని తగ్గించటంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా.. ఇలాంటి వాటిని సమాధానంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రధాని మోడీ తనకు కల్పించే భద్రతను తగ్గించుకోవటం గమనార్హం. ఆయనకు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు) కమాండోలు కంటికి రెప్పలా కాపాడుతుంటారు.
ఆ భద్రతను తగ్గించుకోవాలని నిర్ణయించారు. నిజానికి అధికారంలో ఉన్న వారికి భద్రతను తగ్గించుకోవాలన్న నిర్ణయాన్ని వారికి వారే తీసుకోవాలి. ఇలా చూసినప్పుడు మోడీ తన భద్రతను తానే తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాలి. సమాకాలీన రాజకీయాల్లో ఇలాంటి ఎక్కడో కానీ జరగవు. అందునా ప్రధానమంత్రి హోదాలో ఉన్న వారైతే.. తమ భద్రతను మరింత పెంచుకునేలా ప్లాన్ చేస్తారు.
అందుకుభిన్నంగా మోడీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ ప్రత్యర్థులకు మాస్టర్ స్ట్రోక్ గా మారుతుంది. విపక్ష నేతల భద్రతకు కోత విధించటాన్ని ఎవరైనా తప్పు పడతారు. అధికారంలో ఉన్న తనకుండే భద్రతను తగ్గించుకోవటాన్ని ఊహించలేరు. ప్రస్తుతం ఉన్న వారిలో యాభై నుంచి అరవై శాతం వరకు సిబ్బందితోనే ప్రధాని మోడీకి భద్రతను కల్పించనున్నారు. ఎస్పీజీలో ఉన్న నాలుగు వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైంది.
ఇదిలా ఉంటే.. మాజీ ప్రధాని మన్మోహన్.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను ఉపసంహరించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏమైనా.. అంచనాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటంలో మోడీకి మించినోళ్లు లేరన్న విషయం తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పక తప్పదు.