ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా తప్పదా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2020 7:33 AM GMT
ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా తప్పదా?

కరోనా పుణ్యమా అని.. అన్ని మారిపోతున్నాయి. ఎప్పుడేం జరగాలో అవేమీ జరగని పరిస్థితి. ముందుగా వేసుకున్న అంచనాలకు భిన్నంగా కరోనా ప్రభావం రానున్న నెలల్లో ఎక్కువగా ఉండే వీలుండటంతో షెడ్యూల్ ప్రకారం జరగాల్సినవేమీ జరగని పరిస్థితి. లెక్క ప్రకారం చూస్తే.. ఈ అక్టోబరు- నవంబరు మధ్యలో బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

నవంబరులో ఎన్నికలు అంటే.. కనీసం సెప్టెంబరు నుంచి హడావుడి ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్నది ఆగస్టు కావటంతో.. మహా అయితే నెలలో బిహార్ రాష్ట్ర ఎన్నిక సందడి షురూ అయ్యేది. అందుకు భిన్నంగా ఓవైపు కరోనా.. మరోవైపు వరదల కారణంగా ఇప్పుడా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

ఓపక్క కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం.. మరోవైపు కనుచూపు మేరలో కేసులు తగ్గే అవకాశం కనిపించటం లేదు. దీంతో.. ఎన్నికలు వాయిదా వేయటం మినహా మరో మార్గం లేదన్న మాటను రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మధ్య వరకు కరోనా ప్రభావం ఉండే నేపథ్యంలో.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలు జరిగితేనే మంచిదన్న ఆలోచనలో అధికార జేడీయూ.. బీజేపీలు ఉన్నాయి. అందుకు భిన్నంగా విపక్షాలు మాత్రం వాయిదాను కోరుకుంటున్నాయి.

కరోనాతో పాటు.. వరదల కారణంగా రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మంది ప్రభావితమైన వేళ.. ఎన్నికల్ని వాయిదా వేయటం కంటే మంచి పని ఉండదంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన మెజార్టీ రాజకీయ పార్టీలు ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఎన్నికల సంఘానికి తమ అభ్యర్థనను తెలియజేశాయి. దీంతో.. బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Next Story