సోనూసూద్.. జిందాబాద్..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 26 July 2020 4:22 PM GMTతెరపై ప్రతినాయకుడిగా నటించినా.. నిజ జీవితంలో మనసున్న మంచి మనిషిగా, సాటి మనుషులు కష్టాల్లో ఉంటే ఆదుకునే కరుణామూర్తిగా దేశ ప్రజలందరికీ కనిపించిన మనీషి సోనూసూద్. కరోనా కష్టాలు మొదలైనప్పటి నుంచి అతడు నిర్విరామంగా సాయం చేస్తునే ఉన్నాడు. అన్నార్తులకు అన్నదానం చేశాడు. పట్టణాలు వదలి తమ పల్లలెకు కాలినడకన వెళ్ళిపోతున్న బడుగుజీవుల కోసమే వాహనాలు నిలిపాడు. మీకు నేను ఉన్నాను అంటూ తన చేతల ద్వారా నిరూపిస్తున్న సహృదయుడు సోనూసూద్. ఈ నాలుగు నెలల్లో బడుగుల్ని ఎన్నో విధాలుగా ఆదుకొంటూ వస్తున్న ఈ రియల్ హీరో తాజాగా మరోసారి కష్టాల్లో నిస్సహాయంగా నీరసించిన ఓ పేద రైతు కుటుంబానికి తన నిరుపమాన సాయగుణాన్ని ఇలా చాటాడు...
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ బడుగు జీవి. రెండెకరాల పొలం ఉన్నా.. .అప్పులు,కష్టాలే తప్ప ఏమాత్రం కలిసి రావట్లేదని, నిరాశతో మదనపల్లెలో టీకొట్టు పెట్టుకున్నాడు. చిన్నపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్లున్నాడు. ఇద్దరు అమ్మాయిలను చదివించుకోగలిగాడు. అయితే కరోనా దెబ్బకు లాక్‌డౌన్ వల్ల టీకొట్టు కట్టేయాల్సి వచ్చింది. మళ్లీ స్వగ్రామానికి రావాల్సి వచ్చింది. పల్లెనే కాదు...రెండెకరాల ఆ పొలం కూడా బోసిగా కనిపించింది. సరే టమాటా వేద్దాం అని పూనుకున్నాడు. కాడెద్దులు అద్దెకు అడిగితే రోజుకు రెండువేలు ఇవ్వాలని చెప్పారు. అంత సొమ్ము ఎక్కడ్నుంచి తెచ్చేదని బాగా ఆలోచించి పోనీ ట్రాక్టర్ అద్దెకు అడుగుదామంటే , దానికి గంటకు 500 అద్దె చెల్లించాలన్నారు. చేతిలో చిల్లిగవ్వలేని ఈ దుస్థితిలో అద్దె ఇచ్చుకోలేక ఇక పొలంపై ఆశలు వదులుకోవాల్సిందే అనుకున్నాడు.
అయితే ఇద్దరు కూతుళ్ళు వద్దు నాన్న వదిలేసుకోవద్దు. ఈ పొలమే మనకిక ఆధారం. ఎద్దులు లేకుంటే ఏం.. మేమున్నాంగా కాడి లాగుతాం అన్నగానే ఆ తండ్రి కంట నీరుబికింది. వద్దమ్మా.. మిమ్మల్ని అలా కష్ట పెట్టలేనని వారించినా వారు వినలేదు. మనపని మనం చేసుకంటే తప్పేముంది. మీరేం ఇబ్బంది పడకండని బలవంతాన ఒప్పించారు. అర్ధమనస్సుతోనే ఇక చేసేది లేక సరే అన్నాడు. తెల్లారే పొలంలో కుటుంబం ఉంది. అందరిలో ఎలాగైనా పొలంలో విత్తు పడాలన్నదే ఆలోచన. ఇద్దరు అమ్మాయిలు కాడి పట్టుకుని లాగుతుంటే భూమిపై సాలు పడేలా అతను గట్టిగా పట్టుకున్నాడు. భార్య సాలులో విత్తనాలు విత్తుతోంది. ఈ దయనీయ దృశ్యాన్ని మీడియా పట్టుకుంది. ఒక్కసారిగా ఈ వార్త దేశవ్యాప్తంగా గుప్పుమంది. నిరంతరం మీడియాలో వస్తున్న వార్తల్ని పరిశీలిస్తున్న సోనూసూద్‌కు ఈ దయనీయ సంఘటన కంట బడింది. ఆడపిల్లలు కాడిని లాగుతున్న వీడియోను చూసి తీవ్రంగా చలించి పోయాడు. వెంటనే వారికి వారికి రెండెద్దులు పంపిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.
కానీ ఎందుకో ఆయన మనసొప్పలేదు. ఈ సాయం వారికి చాలదనిపించిందేమో కొద్దిసేపటికే మళ్ళీ స్పందిస్తూ వారికి కావల్సింది ఎద్దులు కాదు.. ట్రాక్టర్ అది వీలైనంత త్వరలో వారి ఇంటి ముందుంటుంది అని ట్వీట్ చేశాడు. అయితే రాజకీయ నేతల్లా హామీలిచ్చి కాడి దించేసే రకం కాదు. ఎందుకంటే ఆయన పక్కా మానవతావాది. అందుకే ఏ మాత్రం పునరాలోచించకుండా వారికి కొత్త ట్రాక్టర్ పంపించాడు. ఆ బడుగు రైతు కుటుంబమే కాదు ఊరి జనాలంతా ఈ సాయానికి అవాక్కయ్యారు. ఎక్కడి సినీ నాయకుడు.. ఎక్కడ ఈ పల్లె.. ఇలా కూడా సాధ్యమా అని చర్చించుకున్నారు. తమ గ్రామస్థుడికి ఓ శాశ్వత ఉపాధి దొరికినందుకు హర్షం వ్యక్తం చేశారు.
కరోనా దెబ్బకు కకావికలమైపోయిన కుటుంబాలకు లెక్కేలేదు. కరోనా వస్తుందేమోనన్న భయం కంటే ఉపాధి పోతుందేమో.. నాల్గు మెతుకులు దక్కడం కష్టమవుతుందేమోనన్న భయమే ఎక్కువగా ఉంటోంది. అయితే సోనూసూద్ లాంటి వారుంటే బడుగులు నిర్వేదంతో తనువులు చాలించాల్సిన దుస్థితి రాదు. మన నీతి పద్యాల్లో.. విత్తమొకరికిచ్చి వితరణ శీల చిత్తమొకరికిచ్చిన బ్రహ్మ చేతలెల్ల పాడయిన చేతలని నిందించారే గానీ సోనూసూద్ లాంటి వారికి వితరణ గుణం (దానగుణం)తోపాటు ఆదుకునేందు సరిపడా సొమ్ము సంపద ఇచ్చిన ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. సోనూసూద్‌ను చూసి దేశం ఇవాళ గర్విస్తోంది. సోనూసూద్.. జిందాబాద్ అంటోంది. అనాలి కూడా!!