శివసేన తుపాకీలో బుల్లెట్లు లేవు..!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Nov 2019 8:00 AM GMTవ్యాపార సంబంధాల్లో గేమ్ థియరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరు లేకా అంతకన్నా ఎక్కువ మంది వ్యాపార లక్ష్యాలున్న వ్యక్తులు లేదా సంస్థలు అనుసరించే వివిధ వ్యూహాలను గేమ్ థియరీలో వివరిస్తారు. అలాంటి ఒక గేమ్ పేరు గ్రిమ్ ట్రిగ్గర్ థియరీ.. ప్రత్యర్థులను మోసం చేసి ఎలా లాభం పొందాలన్న వ్యూహమే ఈ గ్రిమ్ ట్రిగ్గర్ థియరీ.
ఈ థియరీ ప్రకారం ఇద్దరు ఆటగాళ్లు ఉంటారు. వారికి లోపలికి వచ్చే మార్గమే ఉంటుంది తప్ప బయటకు వెళ్లే దారి ఉండదు. ఇద్దరూ కలిసుంటే ఇద్దరూ బాగుపడతారు. లేకపోతే ఒకరు నష్టపోతారు. మొత్తం మీద కలిసి ఉంటే కలదు సుఖం. విడిపోతే తప్పదు విషాదం. ఇద్దరిలో ఒకరు ఏకపక్షంగా దొంగదెబ్బ తీస్తే అసలుకే మోసం వస్తుంది. ఈ ఆట ఆడే అవకాశం ఒకటే సారి వస్తుంది. రెండో సారి ఆడేందుకు ఆటగాడు మిగలరు.
ఇందులో కీలకం పనిష్మెంట్ స్ట్రాటజీ. భరించేంత వరకూ బాధపెట్టడం అన్న మాట. కానీ ఇలాంటి వాళ్లు చూపించే తుపాకీలో వాస్తవానికి బుల్లెట్లు ఉండవు. బెదిరింపుల వరకూ బాగానే ఉంటుంది. బుల్లెట్లు లేవని తెలిశాక ఎదుటివాడు తెగించేస్తాడు.
2008 లో వామపక్షాలు ఈ ఆటను మన్మోహన్ సింగ్ మీద ఆడేందుకు ప్రయత్నించాయి. అప్పట్లో గతంలో ఎన్నడూ లేనంత మంది ఎంపీలు వామపక్షాల వైపు ఉండేవారు. అది వాపు అని తెలియక బలుపు అని పొరబడ్డారు. వారు 123 న్యూక్లియర్ ఒప్పందం విషయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని పడదోసే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కమ్యూనిస్టులు పతనం అనే జారుడుబల్ల మీద దిగజారుతూనే ఉన్నారు. నానాటికి తీసికట్టు నాగంభొట్టు అవుతూనే ఉన్నారు. ఇప్పుడు వామపక్షాలన్నిటినీ కలిపితే లోకసభలో అయిదు సీట్లు లేవు. వామపక్షాల తుపాకీలో బుల్లెట్లే లేవని మొదట మన్మోహన్ గుర్తించారు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.
కశ్మీర్ లో వేర్పాటువాదులు ఇదే గేమ్ ఆడేందుకు ప్రయత్నించారు. బిజెపిని ఇరకాటంలో పెట్టబోయారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే సహకారం సూరేకారంగా మారిపోయే సరికి ఆర్టికల్ 370 పోయింది. ఆర్టికల్ 35 ఏ పోయింది. కశ్మీర్ లో వారి పరపతి పోయింది. దేశవ్యాప్తంగా సానుభూతి పోయింది. ఆఖరికి “న ఘర్ కా ... న ఘాట్ కా” అన్నట్టు అయిపోయింది. వేర్పాటువాదుల తుపాకీ మ్యాగజైన్ ఖాళీ అన్నది తేలిపోయింది. ఇక వారి బెదిరింపులు తాటాకు చప్పుళ్లే. ఈ విషాదాంతం గ్రిమ్ ట్రిగ్గర్ థియరీ ప్రత్యేకత!! వెన్నుపోటు పొడిచిన వారు మిగలడు. రెండో వాడు కాస్త దెబ్బ తిన్నా తట్టుకుని ఎలాగోలా తమాయించుకుని నిలబడతాడు.
చంద్రబాబు, లక్ష్మీ పార్వతిల విషయంలో మాత్రం వెన్నుపోటు పొడిచిన వాడి గన్నులో బోల్డన్ని బుల్లెట్లు ఉన్నాయి. ఆ సంగతి గుర్తించని రెండో పక్షం వ్యూహం లేకుండా విర్రవీగింది. ఆ తరువాతేమైందో తెలుగువాళ్లకి చెప్పనక్కర్లేదు.
ఇప్పుడిదంతా చెప్పడం ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన దాదాపుగా ఇదే గ్రిమ్ ట్రిగ్గర్ థియరీ ఆటను ఆడుతోంది. ఈ ఆటను తెగేదాకా లాగనంత వరకూ ఫరవాలేదు. ఒక్కసారి తెగిపోతే బాలయ్య బాబు భాషలో “నెక్స్ట్ బర్త్ డే ఉండదు.” శివసేన చాలా కాలంగా బిజెపిని బెదిరిస్తూ, భయపెడుతూ, అలక పాన్పెక్కుతూ, ఆక్షేపణ చేస్తూ పొందాల్సిన లాభాలు పొందింది. సంజయ్ రౌత్ కామెంటో లేక సామ్నా విమర్శో చేస్తే గిల్లి కజ్జాలు చేస్తూ వచ్చింది. బిజెపి భరిస్తూ వచ్చింది. కానీ తన గన్నులో గోళీలు లేవని శివసేన గుర్తించలేకపోయింది. బిజెపితో ముఖ్యమంత్రి పదవి చెరిసగంగా పంచుకోవాలని, లేకపోతే ఇంతే సంగతులు అని బెదిరించింది. బిజెపి ససేమిరా అంటే వేసేందుకు శివసేన దగ్గర ఎలాంటి ఎత్తుగడలూ లేవు. దీనితో హిందుత్వకు తిలోదకాలిచ్చి ఎన్సీపీ, కాంగ్రెస్ ల ముందు పిల్లిమొగ్గలు వేయనారంభించింది. ఆఖరికి అందరినీ “మాతోశ్రీ” వద్దకు రప్పించుకున్న శివసేన సోనియా అపాయింట్ మెంట్ కోసం వెంపర్లాడింది. ఇప్పుడు కాంగ్రెస్ ఛీ కొట్టే సరికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఇక ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గిస్తే ఒక మూలన పడుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్సీపీ కాంగ్రెస్ కాపురంలో త్యాగం చేసే రెండో పెళ్లాంగా సవతిపోరు సహించాల్సిన దుఃస్థితి వచ్చింది. గవర్నర్ పాలన వస్తే తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దయనీయ స్థితి దాపురించింది. లేదు కాదు అంటే బిజెపి పెట్టిన షరతులకు తలొగ్గి జూనియర్ పార్ట్నర్ గా బతకాల్సిన పరిస్థితి వచ్చిపడింది. కాదు కూడదంటే మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి. ఈ సారి ఇన్ని సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు.
గ్రిమ్ ట్రిగ్గర్ థియరీలోని అతిపెద్ద పాఠం ఏమిటంటే గుళ్లు లేని గన్ను చూపి ఎక్కువకాలం బెదిరించలేం. గుళ్లు లేవని తెలిసిన మరుక్షణం ఎదుటివాడు రెచ్చిపోతాడు. అందునా ఎదుటివాడు అమిత్ షా అయితే అసలుకే మోసం వస్తుంది!!
- రాకా సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్