ఎంత కవరేజ్ అయితే మాత్రం.. మరీ ఇలానా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 July 2020 8:05 AM GMT
ఎంత కవరేజ్ అయితే మాత్రం.. మరీ ఇలానా?

కొన్ని వారాల క్రితం.. ఒక ఫోటో భారీగా వైరల్ అయ్యింది. ఆదివారం పూట చేపలు కొనేందుకు చేపలమార్కెట్ వద్దకు హైదరాబాద్ ప్రజలు పోటెత్తటం.. ఆ సందర్భంగా వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటాన్ని హైలెట్ చేశారు. కరోనా వేళ.. చేపల కోసం ఇంత ఆరాటమా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. పలువురు విమర్శలు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితికి ప్రభుత్వం కూడా కారణమన్నోళ్లు లేకపోలేదు.

ఈ సందర్భంగా ప్రజల తీరును మీడియా సంస్థలు ప్రశ్నించటం.. ఇది మంచి పద్దతి కాదన్న సుద్దులు చెప్పటం కనిపించింది. కట్ చేస్తే.. సచివాలయం కూల్చివేతను కవర్ చేసేందుకు హైకోర్టు మాటతో ఓకే చెప్పిన ప్రభుత్వం.. సోమవారం మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించింది. టీవీ.. ప్రింట్ జర్నలిస్టులతో పాటు.. ఫోటోగ్రాఫర్లు.. వీడియో గ్రాఫర్లను తీసుకెళ్లారు.

దీనికి సంబంధించిన వార్తలు బాగానే కవర్ అయ్యాయి. అయితే.. ఈ వార్తల్ని సేకరించటానికి వెళ్లిన జర్నలిస్టులు.. వీడియో గ్రాఫర్లు ఇప్పుడు వార్తలుగా మారుతున్నారు. వీడియో గ్రాఫర్లను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక ట్రాలీ లాంటి వాహనాన్ని ఏర్పాటు చేయటం.. అందులో టివీ కెమెరామెన్లను కుక్కేసిన తీరు.. తమ స్వీయ రక్షణను వదిలేసి.. వార్తల సేకరణ కోసం పడిన ఆత్రాన్ని చూస్తే షాక్ తినాల్సిందే.

కరోనా కాలంలో.. జాగ్రత్తలు తీసుకోకుండా.. కవరేజ్ కు రావాలంటూ అధికారులు ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తే.. భౌతిక దూరం లేకుండా తీసుకెళ్లటాన్ని వీడియో జర్నలిస్టులు ఎందుకు ప్రశ్నించలేదు. సరైన పద్దతుల్ని పాటించకుంటే.. తాము రామన్న విషయాన్ని ఎందుకు తేల్చి చెప్పలేదు. పిలిచినంతనే పోలోమని వెళ్లే వారికి రేపొద్దున ఏదైనా అయితే ఎవరిది బాధ్యత?

కారులో వెళుతున్న వేళలో.. ముఖానికి మాస్కు పెట్టుకోలేదంటూ ఫైన్ వేసే పోలీసుల పహరాలోనే.. మీడియాను భౌతికదూరాన్ని పాటించకుండా తీసుకెళ్లిన వైనాన్ని చూస్తే.. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పు పట్టాల్సిందే. అదే సమయంలో.. వారి నిర్లక్ష్యం తమకు శాపం కాకూడదన్న విషయాన్ని పట్టించుకోకుండా.. ఏదో సాధించటానికన్నట్లుగా వ్యవహరించిన వైనం చూస్తే అయ్యో అనిపించకమానదు.

Next Story