కొత్త బులెటిన్‌‌లో కూడా సరైన వివరాలు లేవు.. ప్రభుత్వం పై హైకోర్టు అసంతృప్తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 10:02 AM GMT
కొత్త బులెటిన్‌‌లో కూడా సరైన వివరాలు లేవు.. ప్రభుత్వం పై హైకోర్టు అసంతృప్తి

TS High court questions government approach తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కేసుల విషయంలో ప్రభుత్వం తమ ఆదేశాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.

జూన్ 8 నుంచి అధికారులు ఒక్క ఉత్తర్వును కూడా అమలు చేయడం లేదని.. తమ ఆదేశాలు అమలు చేయడం కష్టమైతే ఎందుకో వివరంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిన్న ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌‌లో కూడా సరైన వివరాలు లేవని పేర్కొంది. కరోనా కేసుల విషయంలో ఏం చేయమంటారో రేపు సీఎస్‌నే అడిగి తెలుసుకుంటామని పేర్కొంటూ.. కరోనాపై దాఖలైన కేసులన్నింటి విచారణ రేపటికి(మంగళవారానికి) వాయిదా వేసింది.

కాగా.. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఆదివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త తరహాలో కరోనా బులెటిన్‌ను విడుదల చేస్తోంది. ఈ బులెటెన్‌లో కూడా సరైన వివరాలు లేవని హైకోర్టు పేర్కొంది. కాగా.. తెలంగాణలో నేడు కొత్తగా 1,473 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 8 మంది మృత్యువాత పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 55,532కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి మొత్తం 471 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story