వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో తొలిసారి...

By సుభాష్  Published on  25 July 2020 4:21 AM GMT
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో తొలిసారి...

దేశంలో తొలిసారిగా తెలంగాణ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. అసలు వాహనదారులు లైసెన్స్ తీసుకోవాలన్నా.. రెన్యూవల్ చేసుకోవాలన్నా.. వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిందే. అందులో ఎన్నో ఇబ్బందులు. వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్టీఏ కార్యాలయంలోకి వెళ్లగా, ప్రతిదానికో రేటు. దళారులను ఆశ్రయిస్తున్న వాహనదారులకు చెబుకు చిల్లు పడాల్సిందే. నిజానికి వెయ్యి రూపాయల పనికి దళారులు దాదాపు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తారు. దీంతో ఆర్టీఏ ఆఫీస్‌లో దళారులే రాజ్యమేలుతున్నారు.

ఇక వాహనదారుల ఇబ్బందులను గమనించిన తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే పలు రకాల సేవలు పొందే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. వాహనదారులు ఆన్‌లైన్‌లో లెర్నింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాడ్జి, సాధారణ పత్రాల స్థాయంలో స్మార్ట్‌ కార్డులు వంటివి ఐదురకాలను ఆన్‌లైన్‌లో పొందే వెసులుబాటు కల్పించింది. అందుకు సంబంధించిన వెబ్‌ సైట్‌ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు.

మున్ముందు మరో 12 రకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారా పొందే విధంగా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ విధానం వల్ల వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే ఈ సేవలన్నీ పొందవచ్చు.

Next Story