డిప్యూటీ సీఎం వర్సెస్ ఫైర్ బ్రాండ్.. జగన్ వద్దకు పంచాయతీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 May 2020 9:04 AM ISTఈ వివాదం అసలు వివరాల్లోకి వెళితే... గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణ స్వామికి ఎస్సీ కోటా కింద డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అసలు నారాయణ స్వామికి కేబినెట్ లో చోటు దక్కుతుందని కూడా ఏ ఒక్కరూ ఊహించలేదు. అయితే జగన్ సీఎం అయితే ఆయన కేబినెట్ లో రోజాకు బెర్త్ ఖాయమన్న వాదనలు గట్టిగా వినిపించినా... రోజాకు చాన్స్ దక్కలేదు. అయితే పార్టీలో కీలక నేతగా ఉన్న రోజాను బుజ్జగించిన జగన్ ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు. మొత్తంగా ఎవరికీ ఎలాంటి అసంతృప్తి కలగకుండా నెట్టుకొస్తున్న జగన్... పార్టీ నేతల మద్య వివాదాలు కూడా రాకుండా చూసుకుంటున్నారు. అయితే నగరి నియోజకవర్గంలో నారాయణ స్వామి ఆకస్మిక పర్యటన జరిపారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని వెంటేసుకుని నగరికి వెళ్లిన నారాయణ స్వామి.. కనీసం తన పర్యటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా రోజాకు అందజేయలేదట. నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో అంబేద్కర్ సంఘం తరఫున దళితులకు కల్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ కోసం నారాయణ స్వామి వెళ్లారట.
తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే నారాయణ స్వామి పర్యటించడం, అది కూడా ఇంకో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేను వెంటేసుకుని మరీ రావడంతో రోజా అగ్గి మీద గుగ్గిలమయ్యారట. తాను నియోజకవర్గంలో ఉన్నా కూడా తనకు సమాచారం ఇవ్వకుండా నారాయణ స్వామి నగరిలో ఎలా పర్యటిస్తారన్నది రోజా ప్రశ్న. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండగా... ఆమెకు సమాచారం లేకుండా వేరే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేను వెంటేసుకుని మరీ నారాయణ స్వామి రోజా నియోజకవర్గంలో పర్యటించడం నిజంగానే వివాదానికి దారి తీసింది. దీనిపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా.. తనకు తెలియకుండా తన నియోజకర్గంలోకి నారాయణ స్వామి ఎలా వస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ తరహా పరిణామాలు చూస్తుంటే... కావాలనే తనకు వ్యతిరేకంగా తన నియోజకవర్గంలో కుట్రలు చేస్తున్నారని అనిపిస్తోందని కూడా ఆమె మండిపడినట్లు సమాచారం. దీనిని ఇంతటితోనే ముగించేది లేదని, నారాయణ స్వామిపై సీఎం వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేసి తీరతానని కూడా రోజా చెప్పినట్లుగా సమాచారం చూస్తుంటే... ఈ వివాదం పెను వివాదంగానే మారే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.