అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలైనా అమలు చేయొచ్చు. కానీ.. పవర్ లేనప్పుడు తాము ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏ ఒక్క దాన్ని ఏ రాజకీయ పార్టీ సొంతంగా నిర్వహించే పరిస్థితి ఉండదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం ద్వారా ఆసక్తికరంగా మారారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. విభజన తర్వాత పవర్లోకి వచ్చిన చంద్రబాబు సర్కారు.. రంజాన్ తోఫా పేరుతో ప్రతి ఏడాది నిత్యవసర వస్తువుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేది. సంక్రాంతి పండుగ వేళలోనూ ఇదే విధానాన్ని అమలు చేసేది. దీనికి ఆదరణ బాగుండేది.

కట్ చేస్తే.. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడింది. అధికారం చేజారింది. ఈ ఓటమిలో అందరిని విస్మయానికి గురి చేసిన అంశం.. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు కమ్ అప్పట్లో మంత్రిగా వ్యవహరించే లోకేశ్ ఓటమిపాలు కావటం. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. తనను రిజెక్టు చేసిన చోటే తన ఉనికిని చాటాలన్న పట్టుదలతో ఉన్న లోకేశ్.. ఓడినప్పటికీ నియోజకవర్గం మీద తన ఫోకస్ మాత్రం తగ్గించలేదు.

తాజాగా.. రంజాన్ సందర్భంగా తమ ప్రభుత్వం అమలు చేసిన తోఫాను తాజాగా తన నియోజకవర్గ ప్రజలకు అందజేశారు. పండుగపూట పస్తులు ఉండకూడదన్న ఉద్దేశంతో నియోజకవర్గంలోని ముస్లింలకు ఈ తోఫాను అందజేశారు. పవర్లో లేకున్నా.. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాన్ని తన నియోజకవర్గంలో అమలు చేసిన లోకేశ్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనను ఓడించినప్పటికి.. తాను నియోజకవర్గాన్ని వదలలేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. ప్రజల అభిమానాన్ని సొంతం చేయటానికి ఇస్తున్న ఈ తోఫా ఫలితం ఎలా ఉంటుందో తేలాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే. ఏమైనా.. రంజాన్ తోఫాతో లోకేశ్ నియోజకవర్గంలో అందరి నోళ్లలో నానారని చెప్పక తప్పదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *