అన్న దెబ్బకు తమ్ముడు లెటర్ ట్వీట్ చేయక తప్పలేదుగా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 12:20 PM GMT
అన్న దెబ్బకు తమ్ముడు లెటర్ ట్వీట్ చేయక తప్పలేదుగా.?

స్వేచ్ఛ చాలా ప్రమాదకరమైనది. అనుకుంటారు కానీ ప్రజాస్వామ్య భావజాలం పార్టీలో ఉంటే తిప్పలు ఎన్నన్న విషయాన్ని కాంగ్రెస్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో తనకు పడనోళ్ల మీద అదే పనిగా విమర్శలు చేసినా.. పార్టీ పెద్దగా పట్టించుకునేది కాదు. కొన్నిసార్లు చర్యలు తీసుకున్నా నామమాత్రమే. కానీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలనే చూడండి. ఆయా పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుంది. నిజానికి నోటి వెంట మాట రావాలంటే పర్మిషన్ తీసుకోవాలన్న కరకుదనం పార్టీలకు అవసరమా అన్నది కొన్నిపార్టీల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

గడిచిన కొద్దిరోజులుగా జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు చేస్తున్న ట్వీట్లు సంచలనంగా మారుతున్నాయి. వివాదాస్పద అంశాల్ని ప్రస్తావిస్తున్న ఆయన తీరుతో జనసేన ఇరుకునపడుతోంది. దీనికి తోడు పవన్ కల్యాణ్ మీద ఏ చిన్న అవకాశం లభించినా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండేవారికి కొదవ ఉండదు. ఇలాంటప్పుడు ఆచితూచి అన్నట్లుగా ఉండాలి.

కానీ.. నాగబాబు మాత్రం అందుకు భిన్నంగా స్వేచ్ఛను.. పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బాగానే ఒంటపట్టించుకున్నట్లున్నారు. తన మనసుకు తోచింది ట్వీట్ల రూపంలో పెట్టేస్తున్న ఆయన తీరుతో తమ్ముడు పవన్ తెగ ఇబ్బంది పడిపోతున్నారు. తాజాగా చేసిన ట్వీట్ దెబ్బకు పవన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

మహాత్మాగాంధీ.. గాడ్సేలను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వివరణ లేఖ ట్వీట్ ను పోస్టు చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదన్నారు. సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు వెల్లడించే భావాల్ని పార్టీ అభిప్రాయాలుగా రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించే అవకాశం ఉందన్నారు.

సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేస్తున్న అభిప్రాయాలన్ని వ్యక్తిగతమన్న పవన్.. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజాసేవ తప్పించి మరే అంశాల జోలికి వెళ్లొద్దంటూ కోరారు. మరి.. క్రమశిక్షణ కలిగిన జనసైనికుడిగా అన్ననాగబాబు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

P1

Next Story